acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

గర్వకారణమైన జ్ఞాపకం

సురవరం సుధాకర్‌ రెడ్డి

మొగల్‌ సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని జయించి ఔరంగజేబు మరణం తర్వాత వారి రాజప్రతినిధిగా వచ్చిన సైనికాధిపతులే నిజాం రాజులు. దిల్లీలో మొగల్‌సామ్రాజ్య ప్రాభవం తగ్గగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంతో రాజీపడ్డారు. దేశంలో 550 సంస్థానాలుండగా, అన్నింటికంటే పెద్దది నిజాం సంస్థానం. నిజాం మైసూరురాజు టిప్పు సుల్తాన్‌కు, మహారాష్ట్రులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు మద్దతు ఇచ్చినందుకు, నిజాం నవాబును కాపాడేందుకు బ్రిటిష్‌ సైన్యాన్ని ఇక్కడ ఉంచారు. వారి ఖర్చుల నిమిత్తం, సర్కారు జిల్లాలను, ఆ తర్వాత రాయలసీమను వారికి అప్పగించారు. అయినా మిగిలిన హైదరాబాదు సంస్థానం దేశంలోని 550 సంస్థానాలలో పెద్దది. దీని వైశాల్యం 82,696 చదరపు మైళ్ళు. ఇది గ్రేట్‌ బ్రిటన్‌ వైశాల్యానికి సమానం. ఇందులో ఎనిమిది తెలుగు జిల్లాలు, ఐదు మరాఠీ జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉండేవి. కోటి ఎనభై లక్షల జనాభాలో సగంమంది మాతృభాష తెలుగు, 25 శాతం మంది మరాఠీ, 12 శాతం మంది ఉర్దూ, 11 శాతం మంది కన్నడ, ఇతర భాషలు మాట్లాడేవారు. కాని ఉర్దూలో తప్ప పాఠశాలలు లేవు. ఆరు శాతం ప్రజలు మాత్రమే అక్షరాస్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ కూడా ఉర్దూలో బోధించేవారు.
ప్రైవేటుగా మాతృభాషలో పాఠశాలలు పెట్టుకోవడానికి వీల్లేదు. గ్రంథాలయాలకు కూడా అనుమతి కావాలి. పత్రికలున్నా తీవ్రమైన సెన్సార్‌ వుండేది. భారతదేశంలో హైదరాబాదు సంస్థానం ఒక చీకటి రాజ్యం. తెలంగాణప్రాంతంలో భూ కేంద్రీకరణ విపరీతంగా వుండేది. మొత్తం సాగులోవున్న భూమి దాదాపు 70% భూస్వాముల చేతుల్లోవుండేది. ఐదువేల ఎకరాలపైన వున్న భూస్వాములు 550 మంది. రాష్ట్రం మొత్తంమీద చిన్న పెద్ద భూస్వాములలో 1982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు వుండేవారు. నిజాం సొంత ఖర్చులకోసం 636 గ్రామాల్లో ఐదు లక్షల ముప్పైవేల ఎకరాల భూమి వుండేది. నిజాం రాజులు అత్యంత విలాసంగా జీవించేవారు. అనేకమంది భార్యలు, ఉంపుడుగత్తెలు వుండేవారు. 7వ నిజాం ఆస్తి ఆనాడు 400 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రపంచంలోకెల్లా ధనవంతుడని పేరుండేది. రాష్ట్రంలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు దుర్భర జీవితం గడిపేవారు. అన్ని కులాలవారు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వ అధికారుల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. నిజాం ప్రభుత్వంలో ఎక్కువమంది అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే. ముఖ్యంగా యు.పి. ముస్లింలు. దీనివల్ల స్థానిక ముస్లింలలో అసంతృప్తి వచ్చింది. ముల్కి (స్థానిక)లకే ఉద్యోగాలు కావాలని ఆందోళనలు 6వ నిజాం మహబూబ్‌ఆలీఖాన్‌ హయాంలోనే ప్రారంభమైంది. హిందువులకు నామమాత్రమైన ఉద్యోగాలు మాత్రమే ఇచ్చేవారు. గ్రామీణ ప్రాంతాలలో దారుణమైన దోపిడీ, వెట్టిచాకిరీ (వేతనం ఇవ్వకుండా ఉచితంగా పని చేయించుకోవటం) వుండేది. ఊళ్ళో రైతులందరూ ముందుగా దేశ్‌ముఖ్‌, జాగీర్దారుల భూములు దున్ని తర్వాత తమ భూములు దున్నుకోవాలి. చెరువునీళ్ళు ముందు భూస్వాములకే ఇవ్వాలి. దళితులు గడీ ముందు ఊడ్చి, శుభ్రంచేసి సాన్‌పి (కళ్ళాపి) చల్లి, పశువుల దొడ్డి శుభ్రంచేసి, మేతవేసి ఇతర పనులు చేయాలి. యజమాని, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన పాలేర్లకు ఉచితంగా చెప్పులు ఇవ్వాలి.
చాకలి ఉచితంగా బట్టలు ఉతకడం, దొర, ఆయన కుటుంబ సభ్యులు బయటి ఊళ్ళకు పోతే వారి కచ్చడం (కోడెల బండి) ముందు పెట్టి నెత్తిన పెట్టుకుని పరిగెత్తాలి. మంగలి ఉచితంగా క్షౌరం చేయడం, పశువులకు వైద్యం చేయాలి. పద్మశాలీలు ఉచితంగా బట్టలు నేసి ఇవ్వాలి. పెళ్ళిళ్ళు, ఉత్సవాలకు అదనపు బట్టలివ్వాలి. యాదవులు ఉచితంగా గొర్రెలివ్వాలి. పాడి వున్న రైతులు ఉచితంగా పాలు పోయాలి. వైశ్యులు ఉచితంగా సరుకులు దేశ్‌ముఖ్‌లకు, అధికారులకు ఇవ్వాలి. బ్రాహ్మణులు ఉచితంగా విస్తర్లు కుట్టి ఇవ్వాలి. గౌడ్‌లు ఉచితంగా కల్లు సప్లయ్‌ చేయాలి. ఇవేకాకుండా దొరల ఇండ్లలో పెండ్లిళ్ళకు అందరు ఉచితంగా పాలు, గొర్రెలు, కోళ్ళు, ధాన్యం ఇచ్చి పనిచేయాలి. అనేక పేద కుటుంబాలవారి మహిళలు మానభంగానికి గురయ్యేవారు. పేదలు దౌర్జన్యానికి గురయ్యేవారు. ఇచ్చిన అప్పుకు అనేక రెట్లు వడ్డీ వసూలుచేసి ఇవ్వకపోతే వారి ఇళ్ళు, భూములు స్వాధీనం చేసుకునేవారు. తప్పుడు కేసులు పెట్టేవారు. కరణాలు తప్పుడు లెక్కలురాసి పేదల భూములు కాజేసేవారు. తెలంగాణలో తెలుగు ప్రజల సంఘంగా ఆంధ్రజనసభ ప్రారంభమైంది. అది ఆంధ్ర మహాసభగా రూపొందింది. జోగిపేట ప్రథమ ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టడం, విజ్ఞప్తులు చేయడంతో ప్రారంభమైంది. యువతరం ముందుకు వచ్చి ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్రతో సమస్యలు మీద పోరాటం ప్రారంభించారు. రావి నారాయణరెడ్డి అధ్యక్ష స్థానానికి పోటీ చేసి 10వ మహాసభలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చారు. 1946 నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది.
ఫ్యూడల్‌ దోపిడీ, దౌర్జన్యాలతో హిందూ భూస్వాములు కూడా ప్రధాన పాత్ర వహించారు. ఈ దశలో ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయవాదుల మధ్య ఘర్షణలో వామపక్షవాదులు మెజారిటీ అయ్యారు. రావి నారాయణరెడ్డి అధ్యక్షుడైన తర్వాత పేద ప్రజల సమస్యలు, తెలుగులో బోధన, వెట్టిచాకిరీ రద్దు తదితర అంశాలపైన కార్యాచరణ తీసుకున్నారు. హైదరాబాద్‌లో మఖ్దుం, రాజబహదూర్‌ తదితరులు కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేశారు. ట్రేడ్‌ యూనియన్లు నిర్మించారు. ముస్లిం మేధావులు కూడా ఫ్యూడల్‌ రాచరికానికి వ్యతిరేకంగా గళమెత్తారు. భారత యూనియన్‌లో చేరనని ‘‘ఆజాద్‌ హైదరాబాద్‌’’ అని స్వతంత్ర రాజ్యాన్ని 7వ నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ప్రకటించారు. దేశవ్యాపితంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం హైదరాబాద్‌ సంస్థాన ప్రజల మీద ప్రభావం చూపింది. గోలుకొండ పత్రిక, మీజాన్‌ పత్రిక (తెలుగు), కొన్ని ఉర్దూ పత్రికలు ప్రజలలో చైతన్యం పెంచాయి.
ఖాశిం రజ్వీ అనే వ్యక్తి మజ్లిస్‌ పార్టీకి అధ్యక్షుడై, హైదరాబాదును స్వతంత్ర ముస్లిం రాజ్యం చేస్తానని ప్రకటించి రజాకార్ల (వలంటీర్‌) నిర్మాణానికి పూనుకుని వేలాదిమంది ముస్లిములను చేర్పించి దాడులు ప్రారంభించాడు. నిజాం మద్దతిచ్చాడు. రజాకార్లకు హిందూ భూస్వాములు మద్దతిచ్చారు. దౌర్జన్యాలు పెరిగేకొద్దీ ప్రతిఘటన పెరిగింది. తెలంగాణను ముస్లిం మెజారిటీ సంస్థానంగా చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి 8 లక్షలమంది ముస్లింలను అంతకు ముందు తీసుకువచ్చారని ఒక ఆరోపణ వుంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి నిజాంకు మధ్య అనేక చర్చల తర్వాత యధాతథ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజుగా కొనసాగుతాడు. యూనియన్‌ సైన్యాలు ఉపసంహరించారు. విదేశాంగ, రక్షణ కేంద్రం బాధ్యతల్లో వుంటుంది. సంస్థాన ఆంతరంగిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రంచేసిన ద్రోహం. ఈలోగా విసునూరి రామచంద్రారెడ్డి (20 గ్రామాలలో 40 వేల ఎకరాల భూస్వామి) ప్రజలమీద దాడులు ఉధృతం చేశాడు. ఆయన తల్లి జానకమ్మ నరరూప రాక్షసి. ఆమె కడివెండి గడీలో ఉంటూ దౌర్జన్యాలు చేసేది. కడివెండిలో ప్రజలు బలవంతపు ధాన్యం లెవీకి వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, గడీలోంచి కాల్పులు జరిపి, దొడ్డి కొమరయ్యను బలి తీసుకున్నారు. ప్రతి రైతు తను పండిరచిన పంటలో కొంత భాగం ప్రభుత్వానికి చెల్లించేవి లెవీ. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లను వదిలిపెట్టి సామాన్య, పేద రైతులమీదనే ఈ లెవీ దౌర్జన్యంగా వసూలు చేసేవారు. అనేక ఇతర గ్రామాలలో రజాకార్లు గ్రామాలను తగలబెట్టి, స్త్రీలను మానభంగాలు చేశారు. అనేకమందిని చంపేశారు. బైరాన్‌పల్లి, పరకాల తదితర గ్రామాలలో డజన్ల సంఖ్యలో ప్రజలు హతులయ్యారు. కామ్రేడ్‌ సి.ఆర్‌. (చండ్ర రాజేశ్వరరావు), సుబ్బారెడ్డి అనే మారుపేరుతో రెడ్డి హాస్టలులో చేరి, రావి నారాయణరెడ్డి, గురవారెడ్డి, మఖ్దుం, రాజ్‌లను పార్టీ సభ్యులుగా చేర్చి పార్టీ నిర్మాణం ప్రారంభించారు. సర్వదేవభట్ల రామనాథం తదితరులు వరంగల్‌లో కార్మిక సంఘాల పోరాటాలు నడిపారు.ఎస్‌.వి.కె. ప్రసాద్‌, తమ్మారెడ్డి తదితరులను ఆంధ్ర పార్టీ తెలంగాణకు పంపింది. సుందరయ్య ఆంధ్ర పార్టీని నిరంతరం గైడ్‌ చేశారు.
ఈ నేపథ్యంలో 1947 సెప్టెంబరు 11 వ తేదీన నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసి సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకుగాను, సాయుధపోరాటం చేయవలసిందిగా రావి నారాయణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటం దావానలంలాగా వ్యాపించింది. రజాకార్లు, నిజాం పోలీసులు, భూస్వాములు ఒకవైపు, కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రజలు మరొకవైపు మోహరించారు. మధ్యతరగతి రైతులు, మేధావులు, వర్తకులు పోరాటానికి మద్దతిచ్చారు. కొంతమంది చైతన్యవంతులైన పెద్ద రైతులు, కరణాలు కూడా చేయికలిపి పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. గ్రామాలలో ఆంధ్ర మహాసభ సభ్యత్వం వుంటే వెట్టిచాకిరీ రద్దవుతుందని పేదలకు విశ్వాసం కలిగింది. వాస్తవానికి భూస్వాముల తరఫున వెట్టిచాకిరీకి పిలవడానికి వచ్చిన గుండాలు ప్రజలు చిట్టీ (సభ్యత్వ రసీదు) చూపగానే వెనక్కు వెళ్ళేవారు. ప్రజలు దీనిని గుదుప సంఘం (లారీల సంఘం) అనేవారు. ప్రజల దగ్గర ఆయుధాలు లేకపోయినా లాఠీలతో, వడిసెళ్ళతో, స్త్రీలు కారంపొడితో, రాళ్ళతో రజాకార్లను ప్రతిఘటించేవారు. నాటు తుపాకులు తయారుచేసుకున్నారు. రజాకార్ల నుంచి లాక్కున్న ఆయుధాలతో యుద్ధం చేశారు.
ఈ పోరాటం ముఖ్యంగా నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా, ఇతర జిల్లాల్లో కొంత పరిమితంగా జరిగింది. కాని దాదాపు అన్ని జిల్లాల్లో జరిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వాలంటీర్లుగా కార్యకర్తలు, ధన సహాయం, ఆయుధ సహాయం చేశారు. భూస్వాములు గ్రామాలు వదిలి హైదరాబాదుకు, ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. 3000 గ్రామాలను కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. దాదాపు పదిలక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. పోరాటం నగర సరిహద్దుల దాకా వస్తున్నదనే అభిప్రాయం కలిగింది. ఆ సమయంలో అరాచకత్వాన్ని, హింసను అరికట్టే పేరుతో యూనియన్‌ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని అన్నివైపుల నుంచి ముట్టడిరచాయి. కొన్నిచోట్ల ప్రతిఘటించినా 3 రోజుల్లో నిజాం సైన్యం లొంగి పోయింది. నిజాం స్వయంగా లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. ఇదొక లాలూచీ కుస్తీ.
మిలటరీ గవర్నరుగా నియమితులైన జనరల్‌ చౌదరి కొందరు రజాకార్లను, ఖాశిం రజ్వీని అరెస్టుచేసి, కమ్యూనిస్టులమీద యుద్ధం ప్రకటించాడు. సుప్రసిద్ధ గాంధేయవాది సరోజినీనాయుడు కుమారుడు డా॥ జయసూర్య, మరికొందరు మిలటరీ గవర్నరును కలిసి తమకు నెల రోజులు గడువిస్తే, కమ్యూనిస్టులతో చర్చించి, సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని, ఆయుధాలు అప్పగించమని కోరుతామని చెప్పారు. దానికి జనరల్‌ చౌదరి, అహంకారంతో నిరాకరించి నెల రోజులెందుకు, వారం రోజుల్లో తెలంగాణలో కమ్యూనిస్టులను ఏరివేస్తానని జవాబిచ్చాడు. అధునాతన ఆయుధాలతో గ్రామాల మీదపడి కమ్యూనిస్టుపార్టీ సభ్యులు, సానుభూతిపరులనుకున్న వారిమీద చిత్రహింసలు, హత్యాకాండ సాగించారు. పారిపోయిన భూస్వాములు యూనియన్‌ సైన్యాలతోపాటు, గ్రామాలకు తిరిగి వచ్చారు. కుచ్చుటోపీలు, షేర్వాణీలు వదిలేసి, గాంధీటోపీలు, ఖద్దరు చొక్కాలతో దర్శనమిచ్చారు. తాము కోల్పోయిన భూములు తిరిగి బలవంతంగా లాక్కున్నారు. అనేకచోట్ల ప్రజలు ప్రతిఘటించారు. అనివార్యంగా సాయుధ పోరాటం కొనసాగింది. హైదరాబాదు సంస్థానం, భారత యూనియన్‌లో విలీనమైనందున, నిజాం దుష్ట ప్రభుత్వం కూలిపోయినందున మధ్యతరగతి ప్రజలు, వర్తకులు, కొందరు మేధావులు సాయుధ పోరాటం ఆవశ్యకత లేదని భావించారు. యూనియన్‌ సైన్యాల దాడిలో పెద్ద సంఖ్యలో కామ్రేడ్స్‌, నాయకులను చంపారు. 1951 చివరిలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై సాయుధ పోరాటాన్ని ఉపసంహరించాలని నిర్ణయించింది.
తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా నిజాం నిరంకుశ పాలన, ఫ్యూడల్‌ పాలన రద్దయి, భారత యూనియన్‌లో విలీనమైంది. భూస్వాముల వద్ద వేల ఎకరాల భూ కేంద్రీకరణ బద్దలైంది. రెండు పర్యాయాలు భూసంస్కరణల ద్వారా ఇది సాధ్యమైనా పేదలకు తగినంత భూమి దక్కలేదు. భూ సంస్కరణలు దేశం ముందు ప్రధాన ఎజెండా అయింది. తెలంగాణలో అమానుషమైన వెట్టిచాకిరీ రద్దయింది. ప్రజలలో చైతన్యం పెరిగింది. వర్గ పోరాటం కొనసాగింది. భూస్వాములు, వారి తాబేదార్లు, ముందు కాంగ్రెసులో, తర్వాత తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితిలలో చేరారు. మళ్ళీ ఇప్పుడు మతోన్మాద బీజేపీలో భాగమౌతున్నారు. బీజేపీ వారు హిందూ`ముస్లిం పోరాటంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ‘‘ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం’’గా చిత్రీకరిస్తున్నారు. ఇందులో హిందువులు, ముస్లింలు అందరూ పాల్గొన్నారు. ముస్లిం కార్మికులు సాయుధ పోరాటానికి మద్దతిచ్చారు. సాయుధ పోరాటం, దాడులు చేసిన రజాకార్లను తప్ప, ముస్లిం పౌరులను చంపలేదు. యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత వారి చాటున మహారాష్ట్రలో కొంతమంది ముస్లింలను ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు సంబంధించినవారు చంపారు. తెలంగాణలో అలాంటి ఘటనలు జరగలేదు.
భారత యూనియన్‌లో హైదరాబాదు సంస్థానం విలీనంలో కాంగ్రెసు పాత్ర కూడా కొంత వుంది. అందులో మితవాదుల పాత్ర నామమాత్రం. స్వామి రామానంద తీర్థ నాయకత్వాన ఉన్న కాంగ్రెసు జాతీయవాదులు గట్టిగా పోరాటం చేశారు. కాని సాయుధ పోరాటానిదే ప్రధాన పాత్ర. బి.జె.పి. మరొక వక్రీకరణ ఆనాటి భారత ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ వల్ల మిలటరీ హైదరాబాదును విలీనం చేసిందనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే. సాయుధ పోరాటం మరింత విస్తరించి కమ్యూనిస్టులు హైదరాబాదు సంస్థానం తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందనే భయంతోనే మిలటరీని పంపారు. ఇది లాలూచీ కుస్తీ. వేలాదిమందిని చిత్రహింసలు పెట్టిన, హత్యలు చేయించిన నిజాంను అరెస్టు చెయ్యకపోగా, రాజప్రముఖ్‌ను చేసి కోటి రూపాయల రాజభరణం ఇచ్చారు. ఇది ‘‘విముక్తా’’ ‘‘రాజీ’’నా ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం కాలంచెల్లిన భూస్వామ్య వ్యవస్థ దాని ఉపరితలం నిర్మాణమైన నికృష్టమైన నిజాం సర్కారు ప్రభుత్వంపైన జరిగిన పోరాటం. గత సంవత్సరం ఎం.ఐ.ఎం. నాయకుడు పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ స్వయంగా, దీనిని ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటంగా వర్ణించారు. ఐతే ఒక వామపక్ష జర్నలిస్టు, ముస్లిం మేధావుల సంస్థ వ్యవస్థాపకుడు, ఈ పోరాటాన్ని కమ్యూనిస్టులకున్న ముస్లిం వ్యతిరేక భావం వల్ల వచ్చిందనే అర్ధంలో వ్యాసం రాయడం విచారకరం.
ఇది మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ఆయన విమర్శ ముస్లిం మేధావుల్లో విషబీజాలు నాటుతుంది. ఆయన పునరాలోచించుకోవాలి. ఈ విమర్శ చర్చ కోసమే ఐతే అది వేరే విషయం. తెలంగాణ సాయుధ పోరాటం, ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల కోసం, సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనంకోసం జరిగిన పోరాటం. ప్రస్తుత నక్సలైట్‌ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపు అనే వాదన పూర్తిగా తప్పు. పోరాటం చైతన్యవంతులైన ప్రజలు నడుపుతారు. మంచి నిర్మాణం, పరిపక్వ నాయకత్వం కలిగిన కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించాలి. సాయుధ పోరాటాన్ని, మిలటరీ జోక్యం తర్వాత వెంటనే ఉపసంహరించి ఉండాల్సిందని ఒక వాదన. 1951 లో ఉపసంహరించడం తప్పని, దానిని కొనసాగించాల్సి వుండేదని వామపక్షాలలో వాదోపవాదనలు జరిగాయి. కొందరు నక్సలైట్లు, తమది సాయుధ పోరాటం కొనసాగింపు అని కూడా వాదించారు. ఇది సరైన వాదన కాదు. ఆంధ్ర ప్రాంతానికి సాయుధ పోరాటాన్ని పొడిగించాలని చేసిన నిర్ణయం, సరైంది కాదు. అక్కడ సాయుధ పోరాటానికి అవసరమైన పరిస్థితులు లేవు. దానివల్ల తీవ్రమైన నష్టం జరిగింది. అపారమైన త్యాగాలు అక్కడి కామ్రేడ్స్‌ చేశారు. ఏదేమైనా తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం. ఆ అమరవీరులకు, పోరాటంలో పాల్గొన్న లక్షలాదిమంది ప్రజలకు, నాయకత్వం వహించిన నాయకులకు జోహార్లర్పించి, వారి లక్ష్యాలను కొనసాగించే ప్రతిన తీసుకుందాం. మన దేశంకోసం, మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఆ యోధులను స్మరించుకుందాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img