అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం…
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ చింతపల్లి మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు అన్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం, అదేవిధంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆయన పతాకావిష్కరణలు చేశారు. అనంతరం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో వీర సాయిబాబాను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనం ఈనాడు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తూ స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. “78వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి ఇంట పండగ వాతావరణం కల్పించిందన్నారు. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం భారతదేశమన్నారు. ఎప్పటి కప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం ప్రపంచానికే ఆదర్శం కావాలన్నారు.అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమన్నారు. అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందించే బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం మన జీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బేతాళుడు, నాగభూషణం, ఆనంద్, రామకృష్ణ, సోమేశ్, అప్పారావు, మంగ్లు, రాములు, వెంకట్రావు, బాబ్జి, జన సైనికుడు కిముడు కృష్ణమూర్తి (పండు) తదితరులు పాల్గొన్నారు.