కుట్టు మిషన్ ల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యం.
స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ స్వర్ణలత
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సమాజంలో మహిళా సాధికారత కోసం అహర్నిశలు పరితపిస్తున్నట్లు స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ పి స్వర్ణలత అన్నారు. బుధవారం చింతపల్లి వచ్చిన ఆమె స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆ కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయ భారతి, ఇతర అధ్యాపకులతో కలిసి కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు నైపుణ్య శిక్షణాభివృద్ధి, (స్కిల్ డెవలప్మెంట్), స్వచ్ఛభారత్ అనే కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత దేశంలోనే మూడవ స్థానంలో ఉన్న స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు ప్రతినిధిగా ఉన్నానన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళల రక్షణ, మహిళల భద్రత, మహిళల ఉపాధి, మహిళల ఆర్థిక అభివృద్ధి, మహిళలకు ఇతర విషయాలపై అవగాహన కల్పించడం తదితర వాటిపై మహిళలను ఉన్న చైతన్య వంతులను చేయడమే ఉమెన్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. అమాయక గిరిజనులను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో సుమారు ఐదు రాష్ట్రాలలో తమ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి పరిసర ప్రాంతాలలో ఇప్పటివరకు వందమందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇదేవిధంగా ఈ ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు, భర్త వదిలేసిన మహిళలకు, చదువు మానేసిన యువతులకు, చదువుకునే ఆర్థిక స్తోమత లేని యువతులకు, ఎక్కువగా చదువుకునే ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు పొందలేని మహిళలకు కుట్టుమిషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నేడు స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులతో సమావేశమై తమ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలలో నైపుణ్య శిక్షణ అభివృద్ధి ద్వారా తమ కాళ్లపై తాము నిలుచునేలా చేయడమే స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆమెను దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయ భారతిని దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.