చింతపల్లి, జి కే వీధి ఎంపీపీలు అనూష దేవి, కుమారి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అల్పపీడన ప్రభావంతో మన్య ప్రాంతంలో కలిగిన నష్టాన్ని అంచనా వేసి దాని కారణంగా ప్రభలే వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చింతపల్లి, జీకే వీధి ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి లు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ అల్పపీడన ప్రభావంతో గడచిన పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగానే గాక ముఖ్యంగా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వలన అనేకచోట్ల రహదారులు కోతకు గురి కావడం, వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రజా జీవనానికి ఇబ్బందికరంగా తయారవ్వడమే గాక ఊటగెడ్డలు కలుషితమై త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తడమే గాక, కలుషిత నీటి వలన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రతినిత్యం అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సిహెచ్ డబ్ల్యు లు, ఆశాలు, అంగన్వాడీలు గ్రామాలలో పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎడతెరిపి లేని వర్షాలు నేపథ్యంలో మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణీలను సమీపంలోని ఆసుపత్రులకు లేదా చింతపల్లిలో ఉన్న గర్భిణీల వసతి గృహానికి తీసుకురావాలన్నారు. గ్రామాలలో వ్యాధులు సోకిన వారిని వెంటనే గుర్తించి సిహెచ్ డబ్ల్యు లు, ఆశాలు, ఏఎన్ఎం లు ప్రాథమిక చికిత్స అందించడంతోపాటు వైద్యులకు సమాచారం అందించి ఆ గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు.