ఆశా కార్యకర్తలతో సమానంగా సి హెచ్ డబ్ల్యూ లకు వేతనాలు పెంచాలి
సి హెచ్ డబ్ల్యు ల సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షురాలు కే పద్మ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సి హెచ్ డబ్ల్యూ లను ఆశాలుగా గుర్తించడంతో పాటు వారితో సమానంగా వేతనాలు పెంచాలని సి హెచ్ డబ్ల్యూ ల సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షురాలు కే పద్మ అన్నారు. సి హెచ్ డబ్ల్యూ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, సి హెచ్ డబ్ల్యు లు, ఆశలు, అంగన్వాడీ కార్యకర్తలతో కలసి మంగళవారం ఆమె ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం క్షేత్రస్థాయిలో ఆశాలు, అంగన్వాడీలతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా సిహెచ్ డబ్ల్యు లు ముందుంటున్నామన్నారు. ఏ శాఖ అధికారి వచ్చిన సి హెచ్ డబ్ల్యూ ల ద్వారానే ఆ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి సిహెచ్ డబ్ల్యు ల వేతనం నెలకు 4 వేల రూపాయలే కావడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆశా కార్యకర్తలతో పాటు సమానంగా పనిచేస్తున్న తమకు, ఆశా కార్యకర్తల వేతనాలలో వ్యత్యాసం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ప్రభుత్వంతో ఏపీ ఆశా వర్కర్స్ (సిఐటియు) రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చలలో కుదిరిన ఒప్పంద జీవోలు, సర్క్యులర్ వెంటనే విడుదల చేయాలని, మన్య ప్రాంతంలో పనిచేస్తున్న ఆశాలకు ఐటీడీఏ ద్వారానే రికార్డులు ఇవ్వాలని, 66 రోజుల దీక్షలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రిఫరల్ కేసులతో వెళ్లిన సిహెచ్ డబ్ల్యూ లు, ఆశలకు టి ఏ, డి ఏ లు వర్తింపచేయాలని, 60 ఏళ్లు నిండిన సి హెచ్ డబ్ల్యూ లు, ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేలా జీవోలు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సహసర సిహెచ్ డబ్ల్యూ లు, ఆశా కార్యకర్తలతో కలిసి ఆర్ వి నగర్ వైద్యాధికారిని కే సౌమ్య కు అందజేశారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో సిహెచ్ డబ్ల్యూ లు, ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.