వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకుడు డాక్టర్ అప్పలస్వామి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – వ్యవసాయ పంటలకు నష్టం వాటిళ్ళ చేయడమే గాక, ఆరోగ్య సమస్యలను కలిగించే వయ్యారి భామ మొక్కల నిర్మూలనకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ అప్పలస్వామి అన్నారు. 19వ వయ్యారి భామ అవగాహన వారోత్సవ(16-22) ముగింపు కార్యక్రమం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ ఏ ఆర్ ఎస్, పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బంది 3 కిలో మీటర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుంచుంపూడి గ్రామంలో ఉన్న వయ్యారి భామ కలుపుని రైతులతో కలసి నిర్మూలించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వయ్యారిభామ మొక్కలు ఎక్కడున్నా వాటిని వెంటనే తొలగించాలని, తొలగించిన మొక్కలను గుంతలో వేసి ఎరువుగా మార్చుకోవచ్చని వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ వయ్యారిభామ మొక్కలను నిర్మూలన చెయ్యక పోవడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలను గురించి, అదే క్రమంలో ఆ మొక్కల వలన వ్యవసాయ పంటలకు జరుగు నష్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డా. కె. బయ్యపు రెడ్డి, డా. పి. బలాహుస్సేన్ రెడ్డి, డా. సీదరి ఉజ్వల రాణి, పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బంది కె. బాబుజీ నాయుడు, ఎస్. శ్వేత, కె. అన్న పూర్ణ, ఆర్. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.