కూలిన కల్వర్టులు, కొట్టుకుపోయిన అప్రోచ్ రహదారుల వలన సమస్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా):- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మన్యంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కల్వర్టులు కూలిపోవడం, అప్రోచ్ రహదారులు కొట్టుకు పోవడంతో మైదాన ప్రాంతాలతో మన్య ప్రాంతానికి సంబంధాలు తెగిపోయాయి. మునుపెన్నడూ లని విధంగా ఈ అల్పపీడనం ఒక్క రోజులోనే మన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేయడంతో పాటు గ్రామాలకు వెళ్లేందుకు అంతంతమాత్రంగా ఉన్న కల్వర్టులు కూలిపోవడం, అప్రోచ్ రహదారులు కొట్టుకుపోవడం, రహదారులు, వంతెనల పై నుంచి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించడం, అదే క్రమంలో పంట పొలాలను కూడా ముంచెత్తిన కారణంగా మన్యంలో ఎన్నడూ లేని విధంగా మన్యంలో సమస్యలు తలెత్తాయి. అల్పపీడన ప్రభావంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇటు నర్సీపట్నం నుంచి అటు కే డీ పేట మీదుగానూ, పాడేరు నుంచి చింతపల్లి వైపు వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు.