తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నాగభూషణం
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మన్య ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి మన్య వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో అల్పపీడనాలు వచ్చినప్పటికీ చెక్కుచెదరని మన్య ప్రాంతం ఈసారి వచ్చిన అల్పపీడన ప్రభావంతో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అయిందన్నారు. వర్షం కారణంగా మన్య ప్రాంతంలోని వాగులు, వంకలు, చెరువులు జలాశయాలు నిండు కుండలను తలపించడమే గాక, పంటపొలాలను సైతం ముంచెత్తాయన్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గృహాలు కూలిపోవడం తో పాటు రహదారులన్నీ జలమయమై కల్వర్టులు, అప్రోచ్ రహదారులు కొట్టుకుపోయి మైదాన ప్రాంతానికి, మన్య ప్రాంతానికి సంబంధాలు తెగిపోయాయన్నారు. అదే క్రమంలో మన్య ప్రాంతంలోనూ అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికే మారుమూల ప్రాంత గిరి గ్రామాలలో ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. ఈ అల్పపీడన ప్రభావదాటికి ఎక్కడా ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తం చేసిన తీరు ప్రశంసనీయమన్నారు. తహసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో ఆశాజ్యోతి, సిఐ రమేష్, ఎస్ఐ అరుణ్ కిరణ్ ల పర్యవేక్షణ అద్భుతం అన్నారు. అదే క్రమంలో ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు సమిష్టిగా ప్రజలకు కలిగే ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ అల్పపీడనం మన్య ప్రాంతానికి పీడకల వంటిదని ఆయన అభివర్ణించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన జోష్యం చెప్పారు.