వంద పడకల ఆస్పత్రి నిర్మాణం వేగవంతం చేయాలి
విధులకు గైర్హాజరయ్యే వైద్యుల సేవలు అవసరం లేదు..
సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అమరావతి సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేశ్ కిశోర్ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున సకాలంలో వైద్యం అందక గర్భస్థ శిశువు సహా గర్భిణీ మృతి చెందిన విషయమై వివిధ దినపత్రికలలో ప్రచురితమైన కథనాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి స్పందించారు. మాతా శిశువుల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలని జాయింట్ కమిషనర్ ను ఆదేశించి చింతపల్లి పంపించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మరణించిన గర్భిణి వంతల పరిమళ కుటుంబ సభ్యులు, వైద్యులను విచారించారు. ఆమెకు చింతపల్లి ఏరియా ఆస్పత్రుల్లో అందించిన చికిత్స రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ ను అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెందిన తెదేపా, జనసేన నాయకులు, పాత్రికేయులు కలసి ఆసుపత్రి పరిస్థితిపై వివరించారు. ప్రసవం నిమిత్తం గర్భిణీ ఆసుపత్రికి వచ్చిన సమయంలో స్త్రీ వైద్య నిపుణులు, మత్తు వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడమే మాతా శిశు మరణాలకు కారణమని ఆరోపించారు. కరోనా సంక్షేమ సంఘం ఇద్దరు వైద్యులే ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు పొందారని, అటువంటి ఆస్పత్రిలో నేడు లెక్కకు మించి వైద్యులు, వైద్య సిబ్బంది మాతా శిశు మరణాలు నమోదు కావడం బాధాకరమని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నది ఈ ప్రాంతీయులకు తెలియకపోవడం, తెలిసిన ఆసుపత్రికి వెళితే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి లేదా విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలిస్తారని, ఈలోపు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని రోగులు, గర్భిణీలు, బాలింతలు బీతిల్లుతున్నారని నాయకులతో సహా పాత్రికేయులు ఆయనకు వివరించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ మాతా శిశువుల మరణం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. మాతా, శిశు మరణాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
ఏరియా ఆస్పత్రిలో ఖాళీయైన మత్తు వైద్యాధికారి పోస్టును సాధ్యమైనంత వేగంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చింతపల్లిలో నిర్మాణంలోనున్న వంద పడకల ఆస్పత్రి పనులు వేగవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతామన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏరియా ఆస్పత్రి లో వైద్యులు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ రమేశ్ కిశోర్ హెచ్చరించారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రి లో కొంతమంది వైద్యులు గైర్హాజరవుతున్నట్టు సమాచారం ఉందన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలనీ, మూడు రోజులు విధులకు ఆలస్యంగా వస్తే ఒక సీ ఎల్ నమోదు చేయాలని సూపరిండెండెంట్ ను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్ ఆధారంగా వైద్యులకు జీతాలు మంజూరు చేస్తామన్నారు. విధులకు గైర్హాజరయ్యే వైద్యుల సేవలు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన గర్భిణి పరిమళ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అదే క్రమంలో అక్కడకు ఫీడర్ అంబులెన్స్ లో చేరుకున్న గర్భిణీని ఆయన పలకరించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు డి సి హెచ్ ఎస్ డాక్టర్ కే కృష్ణారావు, ఏరియా ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ చంద్రశేఖర రావు, మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, నాయకులు పెదిరెడ్ల బేతాళుడు, లక్కోజు నాగ భూషణం, కేశవరావు, బాబ్జి, చిందాడ అప్పారావు, జనసేన పార్టీ నాయకులు ఉల్లి సీతారాం, కిముడు కృష్ణమూర్తి (పండు) పాల్గొన్నారు.