మజీద్ లో మువ్వన్నెల రెపరెపలు
పతాకావిష్కరణ చేసిన ముస్లిం కమిటీ అధ్యక్షుడు మీరా సాహెబ్
ఉత్సాహంగా పాల్గొన్న ముస్లింలు, యువత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పర్వదినం స్వాతంత్ర్య దినోత్సవమని, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మనం ఈనాడు పొందుతున్న స్వేచ్ఛా ఫలాలని చింతపల్లి ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ మీరా సాహెబ్ అన్నారు. స్థానిక మజీద్ క్యూబా లో ముస్లిం కమిటీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా పతాకావిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ 200 ఏళ్ల బ్రిటీష్ పాలకుల దాస్య శృంకలాల నుంచి భారతీయులను విముక్తులను చేసేందుకు పోరాడి ప్రాణాలర్పించిన ఎందరో త్యాగదనుల ఫలితంగా నేడు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తూ స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామన్నారు. ప్రతి మతానికి ఏదో ఒక పర్వదినం ఉంటుందనీ, కానీ భారతీయులందరికీ ఉన్న ఏకైక పర్వదినం స్వాతంత్ర్య దినోత్సవమని, అటువంటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని మతసామరస్యానికి అతీతంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ ఇమామ్, కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.