విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా):- మారుమూల ప్రాంత గిరి గర్భిణీలు బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. రహదారులు లేని గ్రామాలు, అంబులెన్స్ లు వెళ్లలేని ఊర్లు ఇంకా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అల్పపీడన ప్రభావంతో మన్య ప్రాంతంలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న క్రమంలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కోతకు గురై కొట్టుకుపోయిన రహదారులు, కూలిపోయిన కల్వర్టుల కారణంగా మారుమూల గిరి గ్రామాలలోని గర్భిణీలు ప్రసవ వేదనతో ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రాణాలు పణంగా పెట్టడమే గాక, ఆ గర్భిణీ ని ఆసుపత్రికి తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సాహసం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున జీకే వీధి మండలం జర్రెల ప్రాంతానికి చెందిన గర్భిణీని జెర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు జెర్రెల వంతెన పై ప్రమాద భరితంగా ప్రవహిస్తున్న వరద నీటిని దాటేందుకు కుటుంబ సభ్యులు, అటువైపు ఉన్న అంబులెన్స్ కు, ఇటువైపు ఉన్న జీపుకు తాడు ఏర్పాటు చేసి గ్రామస్తులు రక్షణగా ఉండి గర్భిణీని సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. మన్య ప్రాంతంలో రహదారులు సక్రమంగా లేని కల్వర్టులు కొట్టుకుపోయిన ప్రాంతాలలో గర్భిణీలు, రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించేందుకు గిరిజనులు ఇటువంటి సాహసాలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పాలకులు, అధికారులు స్పందించి మారుమూల ప్రాంతాల గిరి గర్భిణీలకు, రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని మన్య ప్రాంతవాసులు కోరుతున్నారు