విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా); పరవాడ సబ్‌స్టేషన్ కూడలిలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన పలువురు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్‌ను కోరారు. ఈ మేరకు అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమంలో విద్యార్ధుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేసారు. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలతో పాటు కళాశాల, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ ష్టేషన్ తదితర కార్యాలయాలు ఈ కూడలి సమీపంలోనే ఉన్నాయని, ఇక్కడ బస్‌షెల్టర్ సదుపాయం లేక విద్యార్ధులు, రోగులు, ఉద్యోగులు, పరిసర గామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వర్రి చంద్రశేఖర్, బండారు చిన్నంనాయుడు, పైల అప్పారావు తదితరులు కలెక్టర్‌కు వివరించారు. నిలువ నీడ లేకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే వారంతా మండు టెండలోనూ, వానలోనూ రోడ్లపై పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉందని సమస్యను కలెక్టర్‌కు చెప్పారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సబ్‌స్టేషన్ కూడలిలో బస్ షెల్టర్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వర్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు.