రైతుల బకాయిలు, కార్మికుల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలి…
ఏ.పి.రైతు కూలీ సంఘం
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.26.09.2024ది. ఈ నెల 28న జరుగనున్న ది.చోడవరం(గోవాడ) సహకార చక్కెర కర్మాగారం మహాజన సభ సందర్భంగా ఏ.పి.రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం చోడవరం లో జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఏ.పి.రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ
” గోవాడ సుగర్స్ లో గత ఆరేళ్ల క్రితం వరకు ఏడాదికి 5లక్షల టన్నులకు పైగా క్రషింగ్ చేస్తూ, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుచేదని తెలిపారు. కానీ, డబ్ల్యుటివో (ప్రపంచ వాణిజ్య సంస్థ) ఆదేశానుసారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో, విదేశాల నుండి ఇబ్బడిముబ్బడిగా పంచదార దిగిమతులు పెంచి, దేశంలో ఉత్పత్తి అవుతున్న పంచదారకు గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారు. గోడౌన్లలో పంచదార నిల్వలు పేరుకుపోయి, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, దీనికి తోడు ఫ్యాక్టరీ పాలక వర్గాలు, అధికార యంత్రాంగాలు కుమ్మక్కై అవినీతి , అక్రమాలకు ‘అక్షయపాత్ర’గా ఫ్యాక్టరీలను మార్చడం, ఉప ఉత్పత్తుల పై ఫ్యాక్టరీకి ఆర్థిక తోడ్పాటును అందించే యూనిట్లు ఏర్పాటు చేయకపోవటంతో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో పడిందని తెలియజేసారు. రాష్ట్రంలో సహకార రంగ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మాత్రమే వాటన్నింటినీ తట్టుకుంటూ నిలిచిందని తెలిపారు. రైతుల బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో, పెట్టుబడుల విపరీతంగా పెరిగి, ఫ్యాక్టరీ చెల్లించే మధ్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు క్రమేనా చెరుకు సాగు తగ్గించారన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గత ఏడాది క్రషింగ్ 1లక్ష 70వేల టన్నులకి ఘోరంగా పడిపోవడమే దీనికి పెద్ద ఉదాహరణ అన్నారు. ఈనెల 28న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభ లోగా రైతులకు గత సీజన్ బకాయిలు, కార్మికుల వేతన బకాయిలు, పిఎఫ్, ఓటి మొదలైనవి పూర్తి స్థాయిలో చెల్లించాలన్నారు. గత పదేళ్ల కాలంలో టిడిపి, వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలతో సైతం ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చారన్నారు. ఎవరు కాదన్నా ఫ్యాక్టరీ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి, కానీ ఎన్నికల అనంతరం అవన్నీ నీటి మీద రాతలు గానే మారిపోతున్నాయిని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఫ్యాక్టరీలో నెలకొల్పుతామన్న ఇథనాల్ ప్లాంట్/ డిస్టలరీ యూనిట్ నేటికీ కాగితాల పైనే ఉందన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో సుమారు 23,500 మంది సభ్య రైతులు,1000 మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి చూపిస్తున్న ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ మహాజనసభలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆ వైపుగా రైతులు, కార్మికులు ప్రభుత్వాన్ని, MP, MLAలను, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేయాలని ఏ.పి. రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు
బేరా.జగదీశ్వరరావు,
గొర్లి రాజు,
అయితిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.
డిమాండ్స్
1) రైతుల బకాయిలు, మరణించిన సభ్య రైతుల ఇన్సూరెన్స్ బకాయిలు కలిపి 9కోట్లు, కార్మికులకు 3 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న జీతాలు, పిఎఫ్, ఇన్సూరెన్స్, ఓటిల బకాయిలను తక్షణమే చెల్లించాలి.
2) రైతులకు టన్నుకు రూ. 4000/-లు మధ్దతు ధర ను ప్రకటించాలి.
3) ఫ్యాక్టరీ రైతులకు చెల్లిస్తున్న మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ‘సలహాధర’ను ప్రకటించాలి.
4) ఫ్యాక్టరీ ఓవర్హౌలింగ్ పనులను పూర్తిస్థాయిలో నిర్వహించి, కాలం చెల్లిన యంత్రాలను మార్చి ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ లో ఎటువంటి తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలి.
5) గత పదేళ్ల కాలంలో ఫ్యాక్టరీలో అమ్మకాలు, కొనుగోలులో, నిర్వహణలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై, వినిపిస్తున్న ఆరోపణలు పై నేటి వరకు తీసుకున్న చర్యలను మహాజన సభ లో ప్రకటించాలి. దోషుల నుండి నష్టపరిహారం రికవరీ చేయాలి.
6)ఈ సీజన్లో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు జరిగితే, దాని మీద వచ్చే ఆదాయాన్ని సభ్య రైతులకు చెల్లించటంలోనూ, ప్లాంట్ ఏర్పాటు పై స్పష్టతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.