విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి లో కనీస సౌకర్యాలు, అభివృద్ది చేసి, యాబై పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని జనరేటర్ సౌకర్యం కల్పించాలని, దీర్ఘకాలిక ఉద్యోగులను బదిలీ చేయాలని అంబులెన్స్ ను రిపేర్ చేయాలని పోస్టుమార్టం సేవలను పునరుద్దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చోడవరం, మాడుగుల రెండు నియోజక వర్గాలకు ముఖ్య కేంధ్రంగా ఉన్న చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి పూర్తిగా అద్వాన్నంగా ఉందన్నారు. కరంటు పోతే ఇన్వర్టర్ లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడంతో రోగులు తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంబులెన్స్ లు గత రెండు సంవత్సరాలగా పని చేయడం లేదన్నారు. గతంలో పోస్టుమార్టం సేవలు ఉండేవని, బిల్డింగ్ కూలిపోయిందని ఇక్కడ పోస్టుమార్టం చేయక పోవడంతో, రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవలు పునరుద్దరించాలని కోరారు. ఎక్స్ రే టెక్నిషయన్ ఉన్నను, ఎక్స్ రే మిషన్, ఎముకల డాక్టర్ లేరన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన వారిని డెలివరీ అయిన వారిని ఓకే వార్డులో పెడుతున్నారని, ఓకే వార్డులో పెట్టడం వలన అంటు రోగాలు (ఇన్ ఫెక్షన్లు) వచ్చేప్రమాదం ఉందని తెలిపారు. చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన రోగులను పెద్ద ఆసుపత్రులకు, పట్టణాల్లో వుండే ఆసుపత్రులకు తరచూ రిఫర్ చేస్తున్నారని తెలిపారు. ఈ ఆసుపత్రిలో కొంత మంది దీర్ఘకాలికంగా ఉద్యోగాలు చేస్తూ, ప్రవేటు క్లినిక్ లు పెట్టుకుని, డ్రాయింగ్ అధికారులను శాసించే స్థాయికి ఎదిగి, రోగులను విస్మరిస్తున్నారని తెలిపారు. ఇక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది రోజూ విశాఖపట్నం నుండి తిరుగుతూ మధ్యాహ్నం అయితే ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్నారు. దాదాపుగా అన్నిరకాల ఉద్యోగులు 60 మంది వరకు ఉన్నారని, ఇందులో ఎనిమిది మంది డాక్టర్లు ఉన్నను, ఏ రోజూ పూర్తిగా పేదలకు వైద్యం అందించే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే కు వివరించి, ఇటువంటి ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆప్ గ్రేడ్ చేసి, అభివృద్ధి చేసి ఆన్ని రకాల సౌకర్యాలు కల్పించ వలసిన అవసరం ఉన్నదని, గౌరవ ఎమ్మెల్యేకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.