– మొద్దు నిద్ర నటిస్తున్న వ్యవసాయ అధికారులు
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.09.2024ది. చోడవరం చుట్టుపక్కల గ్రామాల్లో గల ఫర్టిలైజర్ దుకాణాల్లో అన్ని రకాల ఎరువులు అధిక ధరలకు అమ్ముతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత రెడ్డిపల్లి శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయానికి ఎక్కువగా అవసరమయ్యేడి యూరియా, డి.ఏ.పి, పొటాష్ వంటి ఎరువులు, గుళికలు, పురుగు మందులు తదితరమైనవి అధిక ధరలకు అమ్ముతున్నారని, వీటి కారణంగా అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. రూ.267 లు వుండే యూరియా రూ.325లు నుండి రూ.370 లు పైగా అమ్ముతున్నారని, మిగిలిన ఎరువులు, పురుగు మందులు కూడా ఎమ్మార్పీ కంటే రూ.50 నుండి రూ.100లు పైగా ఆమ్ముతున్నారని చెబుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవలసిన మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల దుకాణదారులు ఇచ్చే లంచాలతో మొద్దు నిద్ర నటిస్తున్నారన్నారు. చోడవరం ఎరువుల దుకాణదారులు రింగ్ గా ఏర్పడి ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెట్టి, వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చోడవరం, చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఫర్టిలైజర్ షాపులలో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతూ అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. ఫర్టిలైజర్ యాజమాన్యం ఎరువుల ధరలను విచ్చలవిడిగా పెంచేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ, రైతులకు మాత్రం అప్పులు మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న చోడవరం ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.