విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమంలో భాగంగా గురువారం చోడవరం మండలం గవరవరం పిహెచ్.సీ. పరిధిలో గల గంధవరం గ్రామంలో ఎడారి సెంట్ ఫ్రెండ్లీ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కిషోర్ బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ యుక్త వయసు రాకుండా వివాహాలు జరపడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆడపిల్లలకు వివాహం జరిపించాలని సూచించారు. చిన్న వయసులో వివాహం జరగడం వల్ల మహిళల్లో అధిక రక్తస్రావం తో పాటు, రక్తహీనత, నెలలు నిండకుండా బిడ్డలు జన్మించడం, కావలసిన బరువు లేకపోవడం, పుట్టిన బిడ్డల్లో ఎదుగుదల లోపం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని వైద్యాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గవరవరం పిహెచ్.సి. ఎంపీహెచ్ఈఓ పి.రవికుమార్, సిహెచ్ఓ కె.శ్రీలక్ష్మి, మహిళా పోలీస్ కె.శిరీష, ఆశ ,ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.