– ఎం.డి. వి.సన్యాసినాయుడు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) :రాష్ట్రంలోని సహకార చక్కెర మిల్లులన్నింటిలో అన్నింటా అగ్రపదాన నిలిచిన ది.చోడవరం సహకార చక్కెర కర్మాగారంలో ఈ నెల 28 న మహా
జన సభ (సర్వసభ్య సమావేశం) నిర్వహించనున్నట్లు ఎం.డి. వి.సన్యాసి నాయుడు తెలియజేసారు. ఈ మేరకు ఎం.డి. ఛాంబర్ లో స్థానిక విలేకరులతో సమావేశమై మాట్లాడారు. 2023-24 క్రషింగ్ సీజన్ కు గాను 1,70,601.054 మెట్రిక్ టన్నుల చెరకు గానుగ ఆడామన్నారు. టన్నుకు రూ.2500లు చొప్పున చెరకు సరఫరా చేసిన 14,791 మంది సభ్య రైతులకు రూ 42.65 కోట్లు నేరుగా వాటి అక్కొంట్లకు జమ చేశామని తెలిపారు. బకాయిలు టన్నుకు రూ. 419.75 పై.లు చొప్పున రూ. 7.16 కోట్లు చెల్లించేందుకు మేనేజ్మెంట్ తరఫున తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. 2024-25 క్రషింగ్ సీజన్ కు గాను సుమారు 10 వేల ఎకరాల్లో చెరకును సరఫరా చేసేందుకు సభ్య రైతులు నుండి అగ్రిమెంట్లు తీసుకున్నామన్నారు. ఈ నెల 12 నుండి ఫ్యాక్టరీ లో కార్మికులను రీకాల్ చేసి, ఓవర్ ఆయిలింగ్ పనులు చేపడతామన్నారు. ఇథనాల్/డిస్టలరి ప్రాజెక్టు స్థాపించుటకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సహాయంతో చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసారు. రానున్న క్రషింగ్ సీజన్లో ఫ్యాక్టరీ పరిధి లోనే కాకుండా నాన్ జోన్ ఏరియాలో తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల ఫ్యాక్టరీల పరిధిలో పండించిన చెరకును రైతుల నుండి తీసుకుంటామన్నారు. వచ్చే సీజన్ లో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు పైబడి చెరకు గానుగ ఆడేందుకు లక్ష్యమన్నారు. ఈ టెండర్ ద్వారా 4 వేల టన్నుల మొలాసిస్ ను రూ.16,500లకు ధర నిర్ణయించామన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఈ నెల 28 న నిర్వహించే మహాసభ పుస్తకాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.