– న్యాయం కోసం పోరాడుతున్న పేదలకు మద్దతు తెలిపిన జనసేన …..
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : అనకాపల్లి జిల్లా చోడవరం బి.ఎన్. ప్రధాన రహదారిలో స్వయం భూ వినాయకుని గుడి ఎదురుగా ఉన్న ఓ నిరుపేదల ఇంటిని స్థానిక పంచాయతీ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా పోలీసులతో కలిసి ఈ నెల 27 తెల్లవారుజామున జెసిబిలతో నేల కూల్చడం అన్యాయమని జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న పేదలను, అకారణంగా కూలిన బ్రతుకులను ఓదార్చి, తమ మద్దతును జననేత శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పేదలు నివాసాలు కూల్చిన పెద్దలు, బడాబాబులు, అధికారులు, పోలీసులు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఇంట్లో నివసిస్తున్న పలువురు స్త్రీలను, దివ్యాంగులను, వృద్దులను లెక్కచేయకుండా వారిని కొట్టి బయటికి తీసుకొచ్చి, ఆ ఇంటిని పడగొట్టిన సంఘటన దురదృష్టం అన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ చోడవరం ఇంచార్జ్ పి.వి.ఎస్. రాజు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ సంఘటనపై అధికారులను సంప్రదించగా రోడ్డుకి ఆనుకుని డ్రైనేజ్ ని నిర్మించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆ సందర్భంలో వారి ఇల్లు కూలినట్లు పంచాయతీ అధికారులు తెలియజేశారన్నారు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని, ఆ రోడ్లో ఎటువంటి నిర్మాణాలు లేవు ఎవరి నుంచి కూడా డ్రైనేజ్ కావాలని అభ్య ర్థనలు కూడా లేవు. అలాగే పలువురు చాలా వరకు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని శాశ్వత నిర్మాణాలు చేసినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం వీరు ఒక్కరి ఇంటిని మాత్రమే కూల్చడం వెనుక రియల్ వ్యాపారులు, మాజీ ఉప సర్పంచ్ సాగర్ హస్తం ఉందని, ఈ ఇంటి జాగాను ఆక్రమించుకోవడం ద్వారా కమర్షియల్ కాంప్లెక్స్ డెవలప్ చేసుకునే ఉద్దేశంతోనే స్థానిక అధికారులుతో వారు కుమ్మక్కై ఈ రకమైన దుశ్చర్యకు పాల్గొన్నట్లుగా క్షేత్రస్థాయిలో ఉన్న పలువురు వ్యక్తులు తెలియజేయడం జరిగింది. అక్కడ పరిస్థితి చుసిన తరువాత వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని తెలియ చేసి, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలియజేస్తూ అక్కడి నుంచే స్థానిక అధికారులతో మాట్లాడి న్యాయపరంగా చేయాల్సిన పనులులో ఇంత దుర్మార్గంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడగడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం బిజెపి పార్టీ ఇంచార్జ్ రమణమూర్తి, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ములునాయుడు, ప్రధాన కార్యదర్శి అల్లం రామప్పరావు , టౌన్ పార్టీ అధ్యక్షులు రమేష్, సి.పి.ఐ. జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, పలువురు ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.