గణేష్ మట్టి విగ్రహాలను పంచి పెట్టిన సబ్ రిజిస్ట్రార్ గీతా లక్ష్మి…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి బొమ్మలే ముద్దు అని అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ గీతా లక్ష్మి అన్నారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని, సద్భావ టీం ఆధ్వర్యంలో సోమవారం మట్టి గణపతి విగ్రహాలను రిజిస్ట్రార్ గీతా లక్ష్మి తమ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలు నీటిలో వేగిరంగా కటిగిపోతాయని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరిగేందుకు చాలా సమయం పడుతుంది అని, దీని కారణంగా ఆయా ప్రాంతంలో నీరు కలుషితం అవుతుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో కలుషితం అయిన నీటి వలన పశువులకు, మత్స్య సంపదకు తీవ్ర పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలియజేసారు. కావున ప్రతీ ఒక్కరూ ప్రకృతి సిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలకు పూజలు జరిపి, పర్యావరణం కలుషితం కాకుండా కాపాడవలసిందిగా కోరారు. ఈ నెల 4నుండి స్థానిక వినాయకుడి గుడి వద్ద సద్భావ టీం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని తెలిపారు.