– దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ డిమాండ్ …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : 18 మంది కార్మికుల మరణానికి కారణమైన ఎసెన్షియా కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి జిల్లా చోడవరంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ కార్మికుల మృతికి, క్షతగాత్రులు కావడానికి కారణమైన కంపెనీ యాజమాన్యాలపైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పైన ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి కంపెనీ యాజమాన్యం కోటి రూపాయలు, ప్రభుత్వము మరో కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాల పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రజలు అభివృద్ధి కేంద్రంగా పరిశ్రమలు ఉండాలని, మానవ విధ్వంసకార పరిశ్రమలను మూసివేయాలని నినాదాలు చేశారు. పరవాడ సినర్జిన్ సంస్థలో నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత విముక్తి ప్రతినిధులు బి. సన్యాసమ్మ, యు.శివ, చోడవరం నాయకులు హుస్సేన్, బోడయ్య, ఈశ్వరి, ద్వారకనగర్ సంక్షేమ సంఘం నాయకులు చిన్నారావు, రహిమాన్, జ్యోతి, మొతి, మహేష్, అప్పయ్యమ్మ, శ్రీను,దావీద్,అక్బర్,భవాని, తదితరులు పాల్గొన్నారు.