– భారత కమ్యునిస్టు పార్టీ (సి.పి.ఎం) డిమాండ్ …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.20.08.2024ది. కలకత్తా ఆర్.కె.జి. వైద్య కళాశాల లో పి.జి. డాక్టర్ పై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ, దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో సీ.ఐ.టీ.యూ., ఎస్.ఎఫ్.ఐ.ఆద్వర్యం లో ఆందోళన చేసారు. అనంతరం మానవహారం ఏర్పడి మహిళలపై హత్యాచారాలు అరికట్టాల్సిందిగా కోరుతూ భారీ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా మహిళా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ మహిళా పి.జి.డాక్టర్ పై అత్యాచారానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకుని కఠినంగా శిక్షించాలన్నారు. బెంగాల్ ప్రభుత్వం అసలు దోషులను దాచి పెడుతూ, ఒక్కరిని మాత్రం అరెస్టు చేయటం దుర్మార్గం అని, మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని, పని ప్రదేశాల్లో అస్సలే లేదన్నారు. ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుందని, ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని, మహిళలకు పిల్లలకు రక్షణ కల్పించాలని, మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాలు భారతావని సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించేంతవరకు పోరాటాలు సాగుతూనే ఉంటాయని, గతంలో ఢిల్లీ నడిబొడ్డులో జరిగిన నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా నేరస్తులకు కఠినమైన శిక్షలు పడటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు వి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేలాదిమంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ కే ప్రాణరక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు నాయకులు, ఆర్.దేముడు నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.