విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం లో గురువారం ఉదయం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రయాణీకులు నానా ఇబ్బందులు తో తడిసి ముద్దయి గమ్యం చేరుకున్నారు. రెండురోజులుగా వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, వర్షం పడకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా వున్నారు. వరి చేలు పొట్ట దశ లో వుండడంతో, భారీ వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎగువ వర్షాలు కారణంగా గెడ్డలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చోడవరం పరిసరాల్లోని కోనాం, రైవాడ, పెద్దేరు, లక్ష్మీపురం రిజర్వాయర్లు ప్రమాద స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.