– ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్న వైద్యులు…
– పేదలకు వైద్య సేవలు అందించాలి…
భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.24.09.2024ది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని చుట్టుపక్కల సుమారు 60 గ్రామాల ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే చోడవరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్ష గా వున్నాయని, ప్రభుత్వం నుండి లక్షలాది రూపాయలు వేతనాలు తీసుకుంటున్న వైద్యాధికారులు, బహిరంగ మార్కెట్ లో ప్రైవేటు వ్యాపారాలు చేస్తూ పేదలను పీధిస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక మీడియాకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ధర్మాసుపత్రి గా పిలిచే ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్మం లోపిస్తోందని అన్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్, డ్రాయింగ్ అధికారి హోదా గల చిన్న పిల్లల వైద్యుడు ఎల్.వినయ్ కుమార్ ‘ నక్షత్ర ‘ పేరుతో ప్రైవేటు క్లినిక్ నడుపుతూ, ఇక్కడకు వచ్చే రోగులకు నక్షత్రాలు చూపెడుతున్నారని తెలిపారు. అలాగే ఫిజియోథెరపీ వైద్యలు కొత్తూరు లో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తూ తమ వ్యాపారాన్ని మూడు కాయలు, ఆరు పువ్వులుగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. అత్యవసర సమయాల్లోను, గర్భిణీలు, బాలింతలు, ప్రమాద సమయాల్లో రోజూ వందలాది మంది రోగులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. ప్రైవేటు వ్యాపారాలు చేసుకునే వైద్యులకు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఓ వ్యాపార ప్రకటన గా నిలిచిందని తెలిపారు. నిత్యం ఇక్కడకు వచ్చే రోగులను తమ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు అందించేందుకు వైద్య ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో సి.పి.ఐ., రైతు సంఘం తరఫున ప్రభుత్వ వైద్య రంగం దిగి వచ్చేలా పోరాటాలు చేస్తామని, దీనికి ప్రభుత్వ వైద్యలు, అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేసారు.