ఎమ్మెల్యే దగ్గుపాటి
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చేయాలి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో జనాభా పెరిగిన నేపథ్యంలో అందుగుణంగా తాగునీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అనంతపురం కలెక్టరేట్ లో జరిగిన ఐఏబీ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్, ఇతర శాసనసభ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆయన నగరంలోని తాగునీటి సమస్య గురించి ప్రసావించారు. అర్బన్ నియోజకవర్గంతో పాటు నాలుగు పంచాయతీల పరిధిలో జనాభా పెరిగిందని పీఏబీఆర్ నుంచి వస్తున్న నీటి కేటాయింపులను పెంచి ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు నేషనల్ పార్క్ లో ఉన్న చెక్ డ్యాం కు నీరు విడుదల చేయాలని దగ్గుపాటి విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో పార్కు నిర్వహణ లేక అధ్వాన్న పరిస్థితికి చేరుకుందన్నారు. ఇప్పుడు చెక్ డ్యాంకు నీరు విడుదల చేస్తే పార్కులో చెట్లను కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు.