ఎం.వి రమణ భౌతిక కాయానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లాలో ఒక కమ్యూనిస్టు దిగ్గజం నేలకొరిగిందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సిపిఐ సీనియర్ నాయకుడు ఎం.వి రమణ మృతి విషయం తెలుసుకొని ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలు నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఆయన ఫోన్ ద్వారా రమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామ్రేడ్ రమణ అంతిమయాత్రలో పాల్గొనాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ఎం.వి రమణ భౌతిక కాయానికి టిడిపి రాష్ట్ర నాయకులు గంగారామ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీ నరసింహ, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు ఇతర టిడిపి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంవి రమణ ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఏఐఎస్ఎఫ్ లో ఆయన కీలకంగా వ్యవహరించారని విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు. రైతులు, పేదల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేపట్టారని అన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఉద్యమంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. అలాంటి నాయకుడును కోల్పోవడం సిపిఐ పార్టీకి మాత్రమే కాకుండా జిల్లా ప్రజలకు కూడా ఒక లోటు అని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలలోకి రావాలనుకుంటున్న వారికి ఎం.వి. రమణ లాంటివారు స్ఫూర్తిగా ఉంటారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.