: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూ వద్దనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సిటీ స్కాన్, పారామెడికల్ విభాగం, కంప్యూటర్ గది, వైద్యుల గది, కన్సోల్ గది, సిఎస్ఎస్డి, ప్రయోగశాల, రక్తనిధి, పరిపాలన విభాగం, అత్యవసర చికిత్స గది, కాత్ లాబ్, ఐసియు, కార్డియాలజీ విభాగం, నాడీ శస్త్ర చికిత్స విభాగం, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సెమినార్ హాల్, మూత్ర వ్యాధుల శస్త్ర చికిత్స, జీర్ణ కోశ శస్త్ర చికిత్స విభాగం, తదితర అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోగుల కుటుంబ సభ్యులతో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవలు బాగున్నాయా, తాగునీరు అందిస్తున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకోగా, వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలను రోగులకు అందించాలని సూచించారు. రోగుల కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉంటే వారి నియామకానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు తొందరగా వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ ను వేరు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ డా.సుబ్రహ్మణ్యం, అనస్థీషియా హెచ్ఓడి నవీన్, కార్డియాలజీ ఆర్ఎంవో సుభాష్ చంద్రబోస్, ఎమ్మెస్ఐడిసి ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ లు, రోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.