రిజర్వాయర్ లో పూర్తి నీటిని నింపగలిగేందుకు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలో గల చాగల్లు రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సమగ్రంగా పరిశీలించారు. శుక్రవారం పెద్దపప్పూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మండలంలోని చాగల్లులో పెన్నా నదిపై నిర్మించిన చాగల్లు రిజర్వాయర్ ను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఎంత, ఇప్పుడు ఎంత నీరు నిల్వ చేస్తున్నాము, పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు నీటి నిల్వకు ఉన్న సమస్యలు, ఇన్ఫ్ ఫ్లో ఎంతవుంది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాగల్లు రిజర్వాయర్ లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు ఎక్కువ నీటిని నింపగలిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చాగల్లు రిజర్వాయర్ ను 1.5 టీఎంసీల నీటిని విలువచేసే సామర్థ్యంతో నిర్మించగా, ప్రస్తుతం 0.9 టిఎంసిలు మాత్రమే నిల్వ చేస్తుండగా, మిగిలిన 0.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలన చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ లో ఏవైనా మరమ్మత్తులు అవసరమైతే వాటిని చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్, ఇరిగేషన్ ఈఈ రమణారెడ్డి, తహసిల్దార్ బాలాజీ, ఎంపీడీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.