కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : భారీ వర్షాల నేపథ్యంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో, జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జిల్లా అధికారులు, మండల తహసీల్దార్ లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ జి. రామకృష్ణారెడ్డి పరిస్థితులపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కూలిపోయే భవనాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్లు : 8500292992, 08554-220009) ను ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు వస్తే కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని మరియు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.