: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద మండల స్థాయిలో అందే సేవల బోర్డును తయారుచేసి ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ ( పి జి ఆర్ ఎస్ ) సంబంధించి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల సర్వేయర్లు, సిఎస్డిటిలతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ ( పి జి ఆర్ ఎస్ ) పై త్వరలో ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యలను జిల్లాలోని అధికారులందరూ పరిష్కరించే దిశగా వెళుతున్నారని, దీనిని మరింత త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే రీ ఓపెన్ చేసినవి ప్రోగ్రెస్ లో 18 ఉన్నవని, 15 జూన్ మాసం నుండి 106 ఉన్నవని, దీనిని స్వయంగా ఓపెన్ చేసి చూడడం జరిగిందని, ఒక అర్జీ దారునికి మాట్లాడడం కూడా జరిగిందన్నారు. ఆ రైతును ఎందుకు రీ ఓపెన్ అయిందని అడగగా, ఆ రైతు తెలపడం ఏమంటే ఎవ్వరు పొలం దగ్గర వచ్చి ఎంక్వైరీ చేయకుండానే పరిష్కరించడం జరిగిందని అందులో తెలిపి ఉన్నారని, అందువల్ల రీ ఓపెన్ చేసామని సదరు అర్జీదారుడు తెలిపారని తెలిపారు. ఇది నిజమని కొంతమంది అధికారులు రెండు రోజుల్లో ముందు ఓపెన్ చేసి ఏదో ఒక విధమైన సమాధానం రాసి సమస్య పరిష్కారమైనట్లు తెలుపుతున్నారని, అలాకాకుండా ఇప్పటినుండి అర్జీ వచ్చిన రోజునే ఓపెన్ చేసి దానిని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని పరిష్కరించేందుకు గడువు ఉంటుందని, సమస్యను సంపూర్ణంగా పరిష్కరించేందుకు వీలవుతుందని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ లో అర్జీదారుని సమస్య పరిష్కారమైన తర్వాత దానికి సంబంధించిన మెసేజ్ అర్జీదారునికి వెళ్తుందని అంతేకాకుండా సమస్య పరిష్కరించిన తర్వాత వారికి ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా కానీ, ఎండార్స్మెంట్ పంపాలని తెలియజేశారు. వారికి తెలియజేసిన ఎండార్స్మెంట్ ను కార్యాలయంలో సంబంధిత ఫైల్ నందు భద్రపరచాలని తెలిపారు.
జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి 1346 అర్జీలు వచ్చాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. దీనిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అర్జీలు ఉంటే ఏ విధంగా పరిష్కరించాలో తెలియజేయాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి 294 అర్జీలు వచ్చాయని, దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సు సంబంధించి 268 ఉన్నాయని, మండల సర్వేయర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఏడి సర్వే వారిని ఆదేశించారు. పంచాయతీ రాజ్ కు సంబంధించి 260 వచ్చాయని, దీనికి సంబంధించి డిపిఓ, జిల్లా పరిషత్ సీఈఓ కు త్వరగా పూర్తి చేయువిధంగా చూడాలన్నారు. పోలీస్ 232, సివిల్ సప్లై 156, సోషల్ వెల్ఫేర్ 103, ఏపీ ఎస్పీడీసీఎల్ 90, సమగ్ర శిక్ష అభియాన్ 87, తెల్ల రేషన్ కార్డుల కొరకు 130, పంచాయతీ సెక్రటరీలు, 86, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రెటరీలపై 75 ఫిర్యాదులు వచ్చాయని దీనిపై డిపిఓ, డిడి సోషల్ వెల్ఫేర్, డిస్టిక్ బిసి వెల్ఫేర్, డీఈవో క్షేత్రస్థాయిలో పర్యటించి వీరిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. సమస్య పరిష్కరించేటప్పుడు క్వాలిటీ ఇండార్స్మెంట్ నమోదు చేయాలని, సమస్య చూశాము పరిష్కరించాము అని నాలుగు పదాలు కాకుండా అర్జిదారునికి అర్థమయ్యే విధంగా కనీసం 15 పదాలతో నిండిన ఎండార్స్మెంట్ ఉండాలన్నారు.
గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను 24 గంటల లోపల ఓపెన్ చేసి మీకు సంబంధించినవి కాకుండా ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే పంపే విధంగా పుష్ చేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యాలయంలో పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసులను నియమించాలని తెలిపారు. పిజిఆర్ఎస్ నోడల్ అధికారులు మరియు జిల్లా అధికారులు పెండింగ్ కేసులు గురించి వాట్సాప్ గ్రూప్ లో వెంటనే స్పందించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాట్స్అప్ గ్రూపులో యాక్టివ్ గా ఉండాలన్నారు. మండల్ స్థాయిలో జరిగే కుల ధ్రువీకరణ పత్రము, అడంగల్, 1బి, తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇలాంటి సమస్యలను జిల్లా స్థాయిలో అర్జీలు వస్తున్నందున మండల స్థాయిలో ఇవ్వవలసిన సేవలు అని ఒక బోర్డును తయారుచేసి తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ముందు సోమవారం ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలని ప్రజలకు తెలియజేయాలని, ఇది తెలుగులో ఉండాలని, తద్వారా ప్రజలు జిల్లా కేంద్రాలకు రాకుండా మండల స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల సర్వేయర్లు, సి ఎస్ డి టిలు, తదితరులు పాల్గొన్నారు.