విశాలాంధ్ర – అనంతపురం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని మనస్తత్వ శాస్త్రం ఆత్మహత్యల నివారణ దినోత్సవం నాడు సెమినార్ హాల్‌లో ఒక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆత్మహత్యలను నివారించవచ్చనే సందేశాన్ని అందించడానికి, విద్యార్థి సమాజంలో అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉపకులపతి ఆచార్య ఎస్ ఎ కోరి ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రాల వారీగా నమోదు అవుతున్న ఆత్మహత్యలు మరియు ఆత్మహత్యలకు గల వివిధ కారణాలపై ఆయన గణాంకాలను ఉదాహరణతో వివరించారు. వర్శిటీ డీన్, ఆచార్య. సి షీలా రెడ్డి విశ్వవిద్యాలయ స్థాయిలో తోటివారి మద్దతు యొక్క ప్రాముఖ్యతను కేంద్రీకరిస్తూ మాట్లాడారు. మనస్తత్వ శాస్త్ర శాఖాడుక్షులు డాక్టర్ చెల్లి కావ్య, ఆత్మహత్య యొక్క హెచ్చరిక సంకేతాలను ప్రధానంగా ప్రస్తావించారు. అదే విభాగానికి చెందిన అధ్యాపకురాలు షేమా అబ్రహం ఆత్మహత్యలు, రక్షణ కారకాలను వివరించారు. ఎం ఎస్ సి అప్లైడ్ సైకాలజీ సెమిస్టర్ III నుండి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యల నివారణకి అవసరమైన మద్దతు గురించి ప్రస్తావించారు. MSc అప్లైడ్ సైకాలజీ సెమిస్టర్ III విద్యార్థులు ఒక చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. విద్యార్థులు చార్ట్‌లను ప్రదర్శించారు. ఒక ప్రత్యేకమైన తెర మీద “జీవితం ఎందుకు విలువైనది? ” అనే ప్రశ్నకు సమాధానం రాయమంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.