కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకండి
— జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ
విశాలాంధ్ర -అనంతపురం : ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్, టెలిగ్రాం, తదితర సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనాలోచితంగా పోస్టులు పెట్టడం వల్ల జరిగే కీడును గుర్తించాలన్నారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టవద్దని సూచించారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగానూ పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే సహించబోమన్నారు. సోషల్ మీడియా అకౌంట్స్, పోస్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానంలో సుశిక్షితులైన సి.ఐ మరియు సిబ్బందిచే 24×7 పర్యవేక్షణ చేపట్టామన్నారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాలను వక్రీకరిస్తూ ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ… వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బ తీసే విధంగా పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ప్రత్యేక సైబర్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. ఈ బృందం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని 24×7 పర్యవేక్షణలో ఉంటుందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్ధేశ్యంతో పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టడం…వారికి నోటీసులు జారీ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తుందన్నారు. తాము పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకుండా ఉండాలన్నారు. పోస్టుల్లో వాస్తవాలను వక్రీకరించడం, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు చేయడం వలన ఇతరుల మనోభావాలు దెబ్బ తింటాయన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలన్నారు. సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలను విస్తృతం చేసేందుకు, దూర ప్రాంతాల్లో ఉన్న మిత్రులు, బంధువులను దగ్గరి చేర్చే విధంగా వినియోగించుకోవాలని కోరారు. చాలామంది యువత సోషల్ మీడియాకు అలవాటు పడి, సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలనే లక్ష్యంతో ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి, అనుచిత పోస్టులు పెట్టి, చట్టాన్ని అతిక్రమిస్తున్నారన్నారు. అంతేకాకుండా, తమ విలువైన సమయాన్ని వృదా చేసుకొంటూ, లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నారన్నారు. యువత, ప్రజలు సోషల్ మీడియాను పాజిటివ్ కోణంలో వినియోగించుకోవాలన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవాలన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నామని ఇతరులచే గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నెటిజనులను హెచ్చరించారు.