విశాలాంధ్ర – అనంతపురం : చిన్నారులు పనిలో కాకుండా బడిలో ఉండాలని, బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో స్పందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి. శివ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు.
బుధవారం సాయి నగర్ లోని జాతీయ నిర్మాణ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుతంగా అడుగులు వేసినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో న్యాయం ఉండడానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని, న్యాయ విజ్ఞాన సదస్సులు లోక్ అదాలత్ లు నిర్వహిస్తుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువత క్రమశిక్షణతో సేవా దృక్పథంతో తమ వృత్తిలో రాణించాలని అన్నారు. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి మాట్లాడుతూ…. చిన్నారులలో పోషకాహార లోపం లేకుండా చూడాలని, నిత్య జీవితంలో నాణ్యత లేని అధిక ధరల ఆహారం బదులుగా, నాణ్యత పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బడి మానివేసి నిరాదరణకు గురైన చిన్నారులను ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని, బాల్యవాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
కార్మిక శాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ…. అసంఘటిత కార్మికులు విధిగా తమ పేర్లను కార్మిక శాఖ నమోదు చేసుకొని గుర్తింపు కార్డులు పొందాలని వాటి ద్వారా జీవిత బీమా సౌకర్యం కలుగుతుందని సూచించారు.
న్యాయవాది హరికృష్ణ మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సేవలను, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను వివరించారు. జాతీయ నిర్మాణ అకాడమీ సంచాలకులు గోవిందరాజులు అకాడమీ అందిస్తున్న సేవలను వివరించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.