జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాల నిర్వహణపై డిపిఓ, జడ్పి సిఈఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ శాఖ వారి ఆదేశాల ప్రకారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఈనెల 14వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించాలని మరియు 14 వ తేదీ నుండి 17వ తేదీ వరకు సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ర్యాలీ, మారథాన్ రన్, వర్క్ షాపులు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఈనెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమం కింద మున్సిపల్, గ్రామ స్థాయిలో, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను మొదలుపెట్టాలని, అన్ని చోట్లా శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రెండు వారాలపాటు చాలా యాక్టివ్ గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయమై ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మరియు సంబంధిత అధికారులు గ్రామ స్థాయి సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని డిపిఓ, జడ్పి సిఈఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, ప్రభుత్వ భవనాలపై మంచి పెయింటింగ్స్ వేయించాలన్నారు. వ్యక్తిగత ఆసక్తితో ఈ కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా శాఖల వాట్సాప్ గ్రూప్ లలో కార్యక్రమాల నిర్వహించి ఫోటోలను పంపించాలన్నారు. సఫారీ కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించాలన్నారు. వర్షాలు రావడంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయమై ఎంపీడీవోలు మానిటర్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు, జడ్పి సిఈఓ ఓబులమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.