20న విజయవాడలో భూ కబ్జా సమస్యలపై సదస్సు
రైతులకు ఉచితంగా విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ
విశాలాంధ్ర – అనంతపురం : అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ధనవంతమైన దేశం గుడ్డిగా ఇజ్రాయిల్ బలపరుస్తోందని, ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులైన నాయకులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని ఆపడానికి ముందుకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మదనపల్లిలో స్మశానాలను కూడా కబ్జా చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రామచంద్ర రెడ్డి సతీమణి స్వర్ణలత పేరు మీద కూడా భూ కబ్జాలు చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయి అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది పోలీసులు కుమ్మక్కై అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అక్కడ కనపడుతోందన్నారు. బత్తలపల్లి లో కూడా నీడి మామిడి మఠం భూములు కోట్ల రూపాయలు విలువ చేసే 19 ఎకరాల 84 సెంట్లు భూమి కబ్జాకు గురి అయింది అన్నారు. విశాఖపట్నంలో కూడా భూ కబ్జాలు భారీగా చోటు చేసుకున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు కూడా కబ్జాలు, ఫేక్ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈనెల 20 విజయవాడ నగరంలో భూ కబ్జాలపై సదస్సు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సదస్సులో భూకబ్జా బాధితులకు అందరికీ న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూకబ్జాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమలో కడప, అనంతపురం,కర్నూల్,అన్నమయ్య, సత్య సాయి జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు 30 శాతం మంది విత్తనం వేయడం జరిగిందన్నారు. వేసిన పెట్టుబడి కూడా రాదన్నారు. వర్షాలు వచ్చినట్లయితే విత్తనాలు, ఎరువులు,రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించాలన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి అన్నారు. సీఎం స్థాయి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి సీ జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, సి. మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.