18 రోజుల బాబుకు లేజర్ శస్త్రచికిత్స
ప్రాణదానం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
విశాలాంధ్ర – అనంతపురం : పిల్లలు పుట్టిన 12 గంటల్లోగా సాధారణంగా మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. కానీ, కొంతమందిలో మాత్రం అరుదుగా అది సరిగా జరగదు. 18 రోజుల వయసు వచ్చేవరకూ ఒక బాబుకు మూత్రవిసర్జన సరిగా జరగకుండా.. కేవలం బొట్లు బొట్లుగా మాత్రమే వస్తుండటంతో గుర్తించిన వైద్యులు.. అందుకు కారణాన్ని కనుక్కుని, లేజర్ శస్త్రచికిత్స చేసి, ఒకరకంగా బాబుకు ప్రాణదానం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు.
“రోడ్డుపక్కన చికెన్ పకోడీ అమ్ముకునే చిరువ్యాపారి మేనరికం పెళ్లి చేసుకున్నాడు. దీనివల్ల బాబుకు జన్యు సమస్యలతో పుట్టుకతోనే మూత్రనాళం మూసుకుపోయింది. 6000 మంది అబ్బాయిలలో ఒకరికి ఇలా వచ్చే అవకాశం వుంటుంది. దీన్ని వైద్య పరిభాషలో పోస్టీరియర్ యూరేత్రల్ వాల్వ్ అంటాము. దీన్ని అలాగే వదిలేస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యి, ప్రాణాల మీదకు వస్తుందన్నారు. అందుకే వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. స్థానిక ఆస్పత్రిలో పుట్టిన ఆ బాబుకు ఈ సమస్య చూసిన అక్కడి వైద్యులు వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు ఆ బాబును కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకురావడం జరిగిందన్నారు.
బాబు సమస్యను చూసిన వెంటనే అతడికి లేజర్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అయితే, కేవలం 18 రోజుల వయసున్న బాబు కావడంతో ఇది బాగా సంక్లిష్టమైన పరిస్థితి. అయినా, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్యుల సాయంతో శస్త్రచికిత్స చేసి, సరి చేయడం జరిగిందన్నారు. ఇంత చిన్న వయసులో పిల్లలకు ఇలాంటి శస్త్రచికిత్స చేసినా, విఫలమయ్యే అవకాశాలు కూడా 25% వరకు ఉంటాయి. కానీ, ఈ కేసులో మాత్రం పూర్తిగా విజయవంతం అవడంతో బాబుకు మూత్రవిసర్జన సాధారణ స్థాయిలోనే రావడం జరిగిందని పేర్కొన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇంత తక్కువ వయసున్న పిల్లలకు ఈ సమస్యకు లేజర్ శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారి. పైగా, తల్లిదండ్రులు పేదవారు కావడంతో ఈ చికిత్స మొత్తం ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేయడం విశేషం.
శస్త్రచికిత్స విజయవంతం అయ్యి, బాబుకు అంతా నయమైంది” అని డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. ఈ శస్త్రచికిత్సలో అనెస్థటిస్టు డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషన్ డా. మహేష్ కూడా పాల్గొన్నారు.