-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర-అనంతపురం : అక్టోబర్ 1వ తేదీన జిల్లాలో పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం గురించి డిఆర్డిఏ పిడి, డిపిఓ, ఆర్డీఓలు, ఎల్డిఎం, ఏపీఎంలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6 గంటలకు జిల్లాలో పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టాలన్నారు. పెన్షన్ మొత్తానికి సంబంధించి బ్యాంకుల్లో నగదును అందుబాటులో పెట్టుకోవాలని, సంబంధిత అధికారులు ముందుగానే పెన్షన్ మొత్తాన్ని డ్రా చేసుకు పెన్షన్ పంపిణీ చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేక దృష్టి సారించి వేగం తగ్గించకుండా సకాలంలో పెన్షన్ల పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ చేపడుతోందని, గ్రామ, మండల స్థాయిలో అధికారులు పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాను నంబర్ వన్ స్థానంలో నిలపాలన్నారు.
జిల్లాలో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారుల ప్రమేయం 100 శాతం ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, క్షేత్రస్థాయిలో శానిటేషన్ వర్కర్లు, పంచాయతీ సెక్రటరీల జాబితా తయారు చేసుకోవాలని, వారికి జాకెట్, క్యాప్ అందించాలని, అన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని మండలాలలో 10 ప్రాంతాలను, మున్సిపాలిటీలలో 20 ప్రాంతాలను క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్ ని గుర్తించాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్త తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో షానిటేషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉన్న నిధులతో కొనుగోలు చేయాలన్నారు. ఈవేస్ట్ పాలసీ ప్రకారం ఈవేస్ట్ ఎప్పటికప్పుడు తొలగింపు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైల్వే పరిధిలో, స్వయం సహాయక సంఘాల పరిధిలో కూడా స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీలను చేయాలన్నారు. మండల స్థాయిలో, మున్సిపాలిటీ, పిహెచ్సి స్థాయిలో శానిటేషన్ వర్కర్లకు హెల్త్ క్యాంపులను నిర్వహించాలన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపేలా అధికారులు పని చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్డిఏ పిడి ఓబులమ్మ, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, ఎల్డిఎం, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.