-ఎమ్మెల్యే పరిటాల సునీతకు రాప్తాడు ప్రజల విజ్ఞప్తి
-నియోజకవర్గ కేంద్రంలో స్మశాన వాటిక సమస్య తీర్చలేకపోయారు
-ప్రకాష్ రెడ్డి పనితీరు ఇంత అధ్వాన్నంగా ఉందన్న పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్న రాప్తాడు ప్రాంతంలో మహిళలకు, యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకునిరావాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఆన్ లైన్ లో పేర్లు మార్చారని, రెడ్ మార్క్ వేశారని, తమ పేరు మీద ఆన్ లైన్ చేయకుండా వేధిస్తున్నారని, మా భూములు మరొకరి పేరు మీదుగా రికార్డులు మార్చారని ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చారు. అలాగే అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మీరు జాకీ పరిశ్రమను తీసుకొచ్చారని.. కానీ ఆ తర్వాత అది మరో ప్రాంతానికి పోయిందన్నారు. వ్యవసాయం రోజు రోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో మహిళలకు, అలాగే యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకుని రావాలని కోరారు. ఈసందర్భంగా సునీత మాట్లాడుతూ గతంలో జాకీ పరిశ్రమ తెస్తే.. కమీషన్ల కోసం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు దానిని వెళ్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ వచ్చి ఉండి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి లభించేదన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాప్తాడులో స్మశాన వాటిక సమస్య కూడా తీర్చలేని అసమర్థ పాలన ప్రకాష్ రెడ్డి చేశారన్నారు. పేదల భూములు కాజేయడం, రికార్డులు మార్చడం వంటి వాటితో ఐదేళ్ల పాలన సాగిందని, అధికారులు అసలైన హక్కుదారులకు భూములు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల విషయంలో రాజకీయాలు ఉండవని.. పార్టీలకతీతంగా ఎవరు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించాలని సునీత సూచించారు. తహశీల్దార్ పి.విజయకుమారి, ఎంపీడీఓ సాల్మన్, మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ, కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.