-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : నేత్రదానం మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురం శాఖ ఆధ్వర్యంలో 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ హాజరై ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుండి మొదలై టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా తిరిగి టవర్ క్లాక్ వరకు చేరుకోవడం జరిగింది. ర్యాలీ ఆద్యంతం నేత్రదానంపై అవగాహనా పిలుపులతో, ప్లకార్డులతో చైతన్యం కలిగించే విధంగా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత మరియు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు, కెఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల, ఎస్ఎస్ఎస్ జూనియర్ బాలిక కళాశాల, అఫలాట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాల అలాగే గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంధత్వ నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించి నేత్రదానంపై అవగాహన కలిగించాలని, అందత్వ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరణానంతరం 6 గంటల లోపల నేత్రాలను సేకరించి కంటి చూపు లేని వారికి ఇద్దరకు కంటిచూపు కలిగించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలోనే ఐ బ్యాంక్ ఏర్పాటు జరుగుతోందని, దీనికి జిల్లాలోని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. త్వరలోనే ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఐ డొనేషన్ కోసం ప్రారంభిస్తామని, ఈరోజే నా కుటుంబం మొత్తం ఐ డొనేషన్ ప్లెడ్జి ఫారం నింపుతున్నానని, ప్రజలు కూడా నేత్రదాన దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ అనంతరం స్థానిక పెన్షనర్లు భవనములో అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు నందు వక్తలు మాట్లాడుతూ… ప్రస్తుతం సేకరించిన నేత్రాలను ఎల్. వి.ప్రసాద్ ఐ బ్యాంకుకు పంపించటం జరుగుతుందని, జిల్లాలో స్థానికంగా ఐ బ్యాంకు ఏర్పాటు ద్వారా జిల్లాలోని వారికి ఉపయోగపడటానికి దోహదమవుతుందని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరు నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు. ఈ ర్యాలీ మరియు అవగాహనా సదస్సు నందు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా.ఈబీ.దేవి, హాస్పిటల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పాల్, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర రావు, జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం ఆఫీసర్ డా.సైదన్న, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డా.మనోరంజన్ రెడ్డి, ఆపిల్ ఐ కేర్ డాక్టర్ జగన్ మోహన్, సీనియర్ కంటి వైద్య నిపుణులు డా.అక్బర్, పెన్షనర్లు అసోసియేషన్ అధ్యక్షులు పెద్దన్న గౌడ్, డా.భవాని, డా.భాను కిరణ్, రెడ్ క్రాస్ మేనేజింగ్ మెంబర్లు డా.జనార్ధన రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఆలంబన జనార్దన్, అప్ప సుధీర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.దివాకర్ రెడ్డి, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రమేష్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.గిరిధర్, విష్ణు ప్రియా, విజయ లక్ష్మి, జైను బేగం, పెన్షనర్లు అసోసియేషన్ మెంబర్లు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, సిబ్బంది, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.