జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో జీవో ఎంఎస్ నెంబర్ .596 ప్రకారం 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూములపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ సమన్వయంతో పునఃపరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో . జీవో ఎంఎస్ నెంబర్ 596 ప్రకారం భూముల ఫ్రీహోల్డ్ యొక్క ధృవీకరణ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో జి .ఓ . ఎంఎస్ . నెంబర్.596 ప్రకారం జిల్లాలో 108.309 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరగగా, దానిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు. 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని అసలు (ఒరిజినల్) వారే రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. భూములకు సంబంధించి సర్వే నెంబర్ వారిగా ఈ ఆఫీస్ ఫైల్ పెట్టాలన్నారు. భూమి సమస్యలపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఖచ్చితమైన దిశలోనే ముందుకు వెళ్లేలా చూసుకోవాలన్నారు. భూమి సమస్యలపై తహసిల్దార్ లు నాణ్యతగా సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఆయా మండలాల పరిధిలో గ్రీవెన్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలని, జిల్లాలోని బొమ్మనహాల్, కుందుర్పి, కంబదూరు, డి.హీరేహాల్ మండలాల పరిధిలో ఎక్కువ భూ సమస్యలు వస్తున్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, జిల్లా రిజిస్టర్ భార్గవ్, ఆర్డీవోలు శ్రీనివాసులురెడ్డి, రాణి సుస్మిత, నగరపాలక సంస్థ కమిషనర్ పీవీఎస్ఎన్ మూర్తి, సర్వే ఏడి రూప్ల నాయక్, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, ఏవో జి.మారుతి, ఆర్డీవో కార్యాలయం డీఏవో విజయలక్ష్మి, సబ్ రిజిస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.