45 ఏళ్ల వ్యక్తికి అత్యంత అరుదైన మెసెంటెరిక్ ఇష్కెమియా
విశాలాంధ్ర -అనంతపురం : అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన మెసెంటెరిక్ ఇష్కెమియా అనే వ్యాధి ఉన్న వ్యక్తికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు కాపాడారు. సరైన సమయానికి శస్త్రచికిత్స చేయకపోతే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ లాంటివి సంభవించి, ప్రాణాపాయం కూడా పొంచి ఉండేది. తీవ్రమైన కడుపునొప్పితో ఏడు రోజులుగా బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం పలు ఆస్పత్రులు తిరిగినా అతడికి ఏమాత్రం ఊరట లభించలేదు. అనంతరం కిమ్స్ సవీరా ఆస్పత్రికి రాగా.. అక్కడ సీఈసీటీ స్కాన్ చేస్తే పేగుల్లో తీవ్రమైన అడ్డంకి ఉందని, అది బహుశా గ్యాంగ్రిన్ కావచ్చని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆస్పత్రిలోని కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మహ్మద్ షహీద్ అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. అందులో దాదాపు 300 సెంటీమీటర్ల మేర చిన్నపేగుకు గ్యాంగ్రిన్ సోకింది. దీనికి కారణం.. మెసెంటెరిక్ ఇష్కెమియా, అంటే రక్తం సరఫరా కాకపోవడం. గ్యాంగ్రిన్ బారిన పడిన పేగును తీసేసి, మిగిలిన పేగును కలిపి కుట్టేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వారం రోజుల్లో పూర్తిగా కోలుకుని, ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు.