: ఘన నివాళులర్పించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర- అనంతపురం : అనంత కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక మారుమూల గ్రామం నుండి చదువుకొని న్యాయవాది వృత్తి చేపట్టి, అనంతరం స్వరాజ్యం అనే దినపత్రిక తెలుగు తమిళ సంచికలలో ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కృషిచేసి, మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకి గుండుకు తన గుండెను ఎదురొడ్డి స్వేచ్ఛా స్వతంత్రాల కోసం గర్జించి, జగతిని జాగృతం చేసి యువతలో స్వాతంత్ర ఉద్యమకాంక్షను రగిలించిన త్యాగధనులు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతి ఒక్క అధికారి, విద్యార్థిని, విద్యార్థులు టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్ఫూర్తితో వెనుకబడిన కులాల వారికి తమ వంతు సహాయం సహకారం అందించాలని, తద్వారా సమాజంలో వారు మెరుగైన స్థితికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ప్రభుత్వ వసతి గృహం అనంతపురం, వసతి గృహ నార్పల విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి ఇంచార్జ్ కలెక్టర్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో జి. రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారిని సుభాషిని, కలెక్టరేట్ ఏవో జి.మారుతి, డిఐపిఆర్ఓ పి.గురుస్వామి శెట్టి విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.