-అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర- అనంతపురం : మహాకవి గుర్రం జాషువా 129 వ జయంతి సందర్బంగా నగరంలోని గుర్రం జాషువా విగ్రహానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అక్షరం నిషేధించబడిన, వెలివేయబడిన అంటరానివాడలో జన్మించి జీవన సమరంలో అక్షర యోధుడై కవితా ఖడ్గం చేబూని సాంప్రదాయ బ్రాహ్మణవాద సాహితీ కోటలను బద్దలు కొట్టి సాహితీ శిఖరాలకు ఎగిసిన కవి కోకిల, కవి సామ్రాట్, నవయుగ చక్రవర్తి, విశ్వకవిగా ఎదిగి “తిరుగులేదు నాకు, విశ్వనరుడ నేను” అంటూ వెలుగొందిన మహాకవి గుర్రం జాషువా అంటూ పేర్కొన్నారు. కవిసామ్రాట్ గుర్రం జాషువా అనేక రచనలు చేశారని, ఖండకావ్యాలు రాశారని, వాటిలో గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర అతి ముఖ్యమైనవని, లఘుకావ్యాలు కూడా ఉన్నాయన్నారు. అంటరానితనం, ఆధిపత్యం, వివక్ష అసమానతలను నిరసిస్తూ, సమానత్వ స్థాపన లక్ష్యంగా సాహిత్య ఆయుధాన్ని చేపట్టి ప్రసిద్ధి చెందిన గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం అని ఎంపీ తెలిపారు. జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను వెతికి, దానికి గల కారణాలను పరిశీలించి, అనేక కోణాలలో ఆలోచించి తన కవిత్వ మార్గాన్ని ఎంచుకున్నారని, సమాజ మార్పు కోసమే జాషువా విశేష సాహిత్య సంపదను సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా అభిమానులు, నిర్వాహకులు, నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.