విశాలాంధ్ర,-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఉరవకొండ గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్, మలేరియా సబ్ డివిజన్ అధికారి కోదండరామిరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని ఒకటవ వార్డు బాలికల ప్రభుత్వ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దోమల నివారణకు హై పోక్లోరైడ్ ద్రావణం స్పెయిoగ్ చేయడంతో పాటు బీజింగ్ పౌడర్ కూడా చల్లడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దోమలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు వర్షం నీరు, మురుగునీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నామన్నారు.సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిరంతరం ఫాగింగ్ చేపట్టడంతో పాటు మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని సిబ్బందికి సూచించామన్నారు. వ్యాధులపై అవగాహనకు పారిశుధ్య మెరుగుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని పంచాయతీ, ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.