నగరపాలక సంస్థ గ్రీవెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
విశాలాంధ్ర – అనంతపురం : నేను రాకముందు వేరు… నేను వచ్చాక వేరు.. ఇది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇచ్చిన వార్నింగ్. గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టండి.. ఇప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇవాళ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యలు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. సిఐటియు నాయకులు పనిముట్ల కోసం నిరసన తెలియజేయగా ఎమ్మెల్యే దగ్గుపాటి వారించారు. మీ సమస్య ఏంటో చెప్పాలంటూ ఆయన అడిగారు. గతంలో పరిస్థితిని వదిలేయండి.. ఇప్పుడు మీకేం కావాలంటూ ఆయన ప్రశ్నించారు. పనిముట్లు ఇవ్వడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. గతంలో కోటి 60 లక్షల రూపాయలతో నిధులు డ్రా చేశారన్న అంశాలను ఎమ్మెల్యే దగ్గుపాటి కార్మికుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే చీపుర్లు, ఇతర పనిముట్లు మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో కోటి 60 లక్షలతో పనిముట్ల కోసం డబ్బులు డ్రా చేస్తే అవి ఎక్కడికి వెళ్లాయని అధికారులను ఆరా తీశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. ప్రస్తుత పాలకవర్గం, మేయర్, మాజీ ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.