జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : స్వచ్ఛత హి సేవ” కింద విప్లవంలా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పిలుపునిచ్చారు. స్వచ్ఛత హి సేవ – 2024లో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో మంగళవారం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవ – 2024 కార్యక్రమాన్ని ఈనెల 14వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుపెట్టారని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ప్రతిరోజు ఒక కార్యక్రమం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. మన జిల్లా, పట్టణం, మండలం, గ్రామం, వీధి, మన ఇళ్లు, మన కార్యాలయం అన్ని కూడా స్వచ్ఛంగా ఉంచాలన్నారు. 2017వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఈ సంవత్సరం స్వచ్ఛత హి సేవ పేరుతో మొదలుపెట్టామన్నారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించామని, ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉపయోగించరాదని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వచ్ఛత పట్ల మన స్వభవంలోనూ, సంస్కారంలోనూ మార్పు రావాలన్నారు. స్వచ్ఛత హి సేవ కింద విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, ఆర్డీఓ వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ పివిఎస్ఎన్ మూర్తి, అదనపు కమిషనర్ శ్రీహరి, డిఎస్డివో షఫీ, డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, తహసీల్దార్ హరికుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.