విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్ద బుధవారము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పద్మా వాణి పాఠశాల బస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా బస్సులోకి వెళ్లి బస్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను, డ్రైవర్ లైసెన్సులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేస్తున్నామన్నారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్, ఆర్సి, పొల్యూషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్, ట్యాక్స్ తదితర అన్ని సర్టిఫికెట్లు తప్పకుండా కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా బస్సు డ్రైవర్ లైసెన్సు లేనిది బస్సు నడపరాదన్నాడు. విద్యార్థులను ఎక్కించుకొని ప్రయాణం చేసే సమయం లో నిర్లక్ష్యంగా, అతివేగంతో నడపరాదన్నారు. మలుపులు ఉన్నచోట జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల యజమానులు రోడ్డు ట్రాన్స్పోర్ట్ నియమ, నిబంధనలు అతిక్రమించిన ప్రైవేట్ పాఠశాల బస్సు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.