జిల్లా కలెక్టర్ కు రూ. 5 లక్షల చెక్కు అందజేత
వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పేర్కొన్నారు. వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో లోలూరు వద్దనున్న సప్తగిరి క్యాంపర్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.హనీఫ్ రూ.ఐదు లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… సామాజిక సేవలో భాగంగా సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు వరద బాధితులకు సహాయార్థం ఐదు లక్షల రూపాయలు అందించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా సప్తగిరి క్యాంపర్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.హనీఫ్ మాట్లాడుతూ.. సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు మహేష్ రెడ్డి మరియు శిల్పారెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో గత 20 రోజులుగా విజయవాడ, కృష్ణా, గోదావరి పరిసర ప్రాంతాల్లో పెను తుఫాను ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. తమ కంపెనీ ద్వారా సామాజిక సేవలో భాగంగా జిల్లా కలెక్టర్ కు ఐదు లక్షల చెక్కును ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు తమవంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా సామాన్య ప్రజలకు అవసరమైన వైద్య సంరక్షణ & చికిత్స అందించడం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు అవసరమైన కీలకమైన వైద్య పరికరాలను 2023-24 ఆర్థిక సంవత్సరానికి తమ కంపెనీ నుండి సిఎస్ఆర్ నిధుల కింద 11 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ కి అందించామని తెలిపారు. గతంలో కూడా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వైద్య పరికరాలు కోసం 20 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు.