వార్డు సభ్యులు విజ్ఞప్తి
విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో అనేక సమస్యలు నెలకొన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్, నిరంజన్ గౌడ్, ఎం. రామాంజనేయులు, ముస్కిన్ సాహెబ్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో సభ్యులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో రోడ్డు డివైడర్ మధ్యలో వేపుగా పెరిగిన కోనకర్పస్ చెట్లు వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటిని తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలోని శివరాంరెడ్డి, లక్ష్మీనరసింహ కాలనీ పాతపేట, పాత్ మార్కెట్ ఏరియాలలో మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని దోమల నివారణకు ఆయిల్ బాల్స్ కూడా వేయాలని పేర్కొన్నారు. పట్టణంలోని టవర్ క్లాక్, కవిత హోటల్ సర్కిల్, బాలాజీ టాకీస్, చర్చి సమీపంలో ట్రాఫిక్కుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ట్రాఫిక్ ను నియంత్రించడానికి గ్రామపంచాయతీ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో సమస్యను పరిష్కరించాలన్నారు. పట్టణంలో ఇప్పటికీ అనేక వార్డులలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అలాంటి ప్రాంతాలను గుర్తించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.