విశాలాంధ్ర – అనంతపురం : కడుపులో క్యాన్సర్ వచ్చి, మొత్తం కడుపునే తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి సంక్లిష్టమైన కేసు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహ్మద్ షాహిద్ తెలిపారు.
“అనంతపురం జిల్లా సెట్టూరు మండటం యతకల్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల గొల్ల చిక్కమ్మ అనే సాధారణ గృహిణికి చాలా కాలం నుంచి ఆకలి లేకపోవడం, అన్నం తినకపోవడం, విపరీతమైన గ్యాస్ సమస్య ఉండటంతో ఆమె కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడకు వచ్చేసరికి ఆమె కేవలం 30 కిలోల బరువు మాత్రమే ఉన్నారు. ముందుగా ఆమెకు ఎండోస్కొపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు చేయగా, ఆమెకు కడుపులో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి, కడుపు భాగం మొత్తం తొలగించాల్సి వచ్చింది. దాంతోపాటు లింఫ్‌నోడ్స్ కూడా తీసేశాము. శస్త్రచికిత్స చేసిన తర్వాత తొలగించిన భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా.. ఆమెకు రెండో దశ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. పూర్తిగా కడుపు భాగాన్ని తొలగించడంతో చిన్న పేగులను ఆహారనాళానికి కలపాల్సి వచ్చింది. కడుపు మొత్తం తీసేయడం వల్ల ఇక ఆమెకు రేడియేషన్ గానీ, కీమోథెరపీ గానీ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో వారం రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండటం యతకల్ గ్రామానికి చెందిన రోగి గొల్ల చిక్కమ్మ మాట్లాడుతూ మేము కర్నాటకలోని అనేక ఆస్పత్రులను తిరిగాం, కానీ ఎక్కడ కూడా మాకు సరైన వైద్యం చేయలేదు. కిమ్స్ సవీర వచ్చిన తర్వాత డాక్టర్లు మాకు మంచి వైద్యం అందించి చనిపోతా అనుకున్న నన్ను బ్రతికించారు. డాక్టర్లకు, హాస్పిటల్ యాజమాన్యాన్నికి రుణపడి ఉంటామన్నారు.