-19 మంది క్రికెట్ బుకీల అరెస్టు
-రూ.8,60,000 నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం
-మీడియా సమావేశంలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు వెల్లడి
విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై బుకీలను అరెస్టు చేసిన సంఘటనపై రాప్తాడు సబ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ శ్రీహర్ష, ఇటుకలపల్లి ఎస్సై విజయ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎస్పీ ప్రత్యేక బృందం, ఇటుకలపల్లి పోలీసులు సంయుక్తంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశామన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 12 మంది, హర్యానా రాష్ట్రానికి చెందిన ఏడు మందిని పట్టుకుని వీరి నుంచి రూ. 8లక్షల 60 వేల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో పోలీసులు అనిల్, వెంకటేష్, దేవదానం పాల్గొన్నారు.